( ఆంధ్రప్రభ స్మార్ట్, చింతూరు )
మావోయిస్ట్ పార్టీ సభ్యురాలు సోడీ సుక్కి బుధవారం చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఎదుట లొంగిపోయారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రా సరిహద్దు రాష్ట్రం చత్తీస్ ఘడ్ సుకుమా జిల్లా చింతగుప్ప పోలీస్స్టేషన్ పరిధిలోని దులోడ్ గ్రామానికి చెందిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ, బస్తర్ డివిజినల్ కమిటీ టైలరింగ్ బృందం సభ్యురాలు సోడి సుక్కి చింతూరు పోలీసులకు లొంగిపోయారు.
పామేడు ఏరియా కమిటీ, సీఎన్ఎమ్ అధ్యక్షుడు తరుచూ దులోడ్ గ్రామ సభల్లో తన విప్లవ గేయాలు , నృత్యాలతో మావోయిస్ట్ పార్టీ వైపు ఈమెను ఆకర్షించారు. ఆమె మావోయిస్టు పార్టీలో జాయిన్ చేరారు. 2022 సెప్టెంబర్ నెలలో సోడి సుక్కీని ఏ సెక్షన్ ఫ్లాటూన్, సెకండ్ కంపెనీ, పీఎల్జీఏ బెటాలియన్ సభ్యురాలుగా నియమించారు. ఈమెకు ఆరునెలు శిక్షణ ఇచ్చి పార్టీ సభ్యురాలుగా పదోన్నతి కల్పించారు. రైతుకూలీ బృందానికి బదిలీ చేశారు. ఈమె మావోయిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు 2023లో మెట్టగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈవోఎఫ్ ఘటనలో పాల్గొన్నారు.
తల్లి మరణంతో పార్టీకి దూరం..
సోడి సుక్కీ తల్లి ఈ ఏడాది జనవరిలో మృతి చెందింది, తల్లి మృతదేహాన్ని చూడటానికి కూడా మావోయిస్ట్ పార్టీ పెద్దలు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి పార్టీ దూరంగా ఉన్నారు. మావోయిస్టు పార్టీ సిద్దాంతాలకు విసిగిపోయి, పోలీస్ పరివర్తన కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనలతో పోలీసులు గిరిజనలకు చేరువుతున్న తరుణంలో ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని చూసి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రశాంత జీవితం గడపడానికి లొంగిపోయింది.
ప్రశాంత జీవనం కోసం…
మావోయిస్ట్ పార్టీని వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోయిన సోడి సుక్కీకు ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు రూ. 1 లక్ష నగదు, ఇతర వసతులు కల్పిస్తామని ఏఎస్పీ తెలిపారు. ప్రస్తుతానికి ఆమెకు దుస్తులు, నిత్యవసర వస్తువులను ఏఎస్పీ అందజేశారు. మావోయిస్టులు అడవుల్లో ఉండి సాధించేది ఏమి లేదని జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ సహాయక కమాండెంట్ దివాకర్, చింతూరు సీఐ దుర్గా ప్రసాద్, ఎస్ ఐ పేరూరి రమేష్, గజేంద్ర కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.