Friday, November 22, 2024

Surprise Visit – వాలంటీర్ ఇంటికి రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్… ఆ త‌ర్వాత‌…

మచిలీపట్నం జులై 9( ప్రభ న్యూస్): వంద శాతం అక్షరాస్యత సాధనలో తన వంతు కృషిచేసి జి ఈ ఆర్ బ్యాడ్జ్ పొందిన ఓ వాలంటీర్ను వారి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి అభినందించిన అరుదైన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా బడి ఈడు పిల్లలందరూ బడిలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో వార్డు వాలంటీర్ కల్పన తన క్లస్టర్ పరిధిలో ఉన్న 21 మంది 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ నూటికి నూరు శాతం పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ చేసినందుకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జి ఈ ఆర్)బ్యాడ్జ్ లభించింది.

ఈ విషయం ఆన్లైన్లో గమనించిన రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తన పర్యటనలో భాగంగా గుడివాడ మున్సిపల్ పట్టణంలోని 28వ వార్డు బేతవోలు-2 సచివాలయం లో వాలంటీర్ గా పనిచేస్తున్న ఎండ్రపు కల్పన ఇంటికి వెళ్లి ఆమెను అభినందించారు. ఆమె ఎన్రోల్మెంట్ చేసిన విధానాన్ని, ఎవరెవరు ఎక్కడ, ఏమి చదువుతున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలతో సంతృప్తి చెందిన కార్యదర్శి ఆమెను అభినందించారు. ఆమె కుటుంబ సభ్యులతో కలసి వారు ఫోటో దిగారు.
దీంతో వాలంటీర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తనలాంటి వాలంటీర్లు చేసే పనిని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి అభినందిస్తారా అని ఆశ్చర్యపోయింది. తన ఇంటికి వచ్చి తనను అభినందించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఇది మరెందరో తన లాంటి వాలంటీర్లు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని నూరు శాతం అక్షరాస్యత సాధించుటలో పాఠశాల విద్య కార్యదర్శి చేస్తున్న అవిశ్రాంత కృషికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తమ వంతు మద్దతు ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement