Friday, November 22, 2024

సార‌థులొస్తే మేం ఏం కావాలి..వైసిపి స‌ర్పంచుల గోడు..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సర్పంచ్‌లకు, స్థానిక సంస్థల ప్రతినిధులకు తగిన గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదని గ్రామ ప్రథమ పౌరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో తమకు ఎటు వంటి అధికారాలు లేకుండా పోయాయని, తాజాగా గృహ సారథులు, రాజకీయ కన్వీనర్ల రాకతో ఉన్న కొద్దపాటి ప్రాధాన్యతను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తూ పోరుబాటకు సిద్ధమవుతున్నారు. అందుకోసం కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. 12 డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం తీర్మానం కూడా చేసింది. ఈ మేరకు ఆ సంఘం ముఖ్య నాయకులు భేటీ అయి గృహ సారథుల వ్యవస్థపై సుదీర్ఘంగా చర్చించి పోరుబాటకు సిద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సంఘం నిధులు పూర్తిస్థాయిలో పంచాయతీలకు అందకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు మేజర్‌ పంచాయతీలు సైతం కరెంట్‌ బిల్లులు కూడా చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే వివిధ పనులకు సంబంధించి సర్పంచ్‌లకు గతంలో ఉన్న అదికారాలను కూడా క్రమేనా తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో ప్రథమ పౌరులు కొన్ని పంచాయతీల్లో ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోంది. మరికొన్ని గ్రామాల్లో అయితే ఉత్సవ విగ్రహాల్లా మారాల్సి వస్తోంది. గతంలో సర్పంచ్‌గా గెలుపొందిన ప్రథమ పౌరులు పంచాయతీ పరిధిలో సర్వాధికారాలను కలిగి ఉండేవారు. అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్పంచ్‌లు కొన్ని అధికారాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు ఉద్యమానికి నడుం బిగిస్తున్నారు.

12 డిమాండ్లతో పోరుబాట
గ్రామ సచివాలయ వ్యవస్థతో పాటు గృహ సారథుల రాకతో గ్రామ సర్పంచ్‌లు పూర్తి అధికారాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం 12 డిమాండ్లతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకే అందేలా చూడాలి. అలాగే గ్రామ సర్పంచ్‌ల నిధులు, విధులు అధికారాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా 12,918 గ్రామ సర్పంచ్‌లకు పంపిన సుమారు 8,660కోట్ల రూపాయలను తిరిగి సర్పంచ్‌ల పీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలో జమ చేయాలి.అలాగే గ్రామ సచివాలయ వలంటీర్లను సర్పంచ్‌ల ఆధ్వర్యంలోకి తీసుకురావాలి. అదే విధంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు నెలకు రూ. 15వేలు, ఎంపీపీ, జడ్పీటీసీలకు నెలకు రూ. 30వేలు గౌరవ వేతనం ఇవ్వాలి. అదే విధంగా గతంలో ఉపాధి హామీ నిధులను గ్రామ సర్పంచ్‌ల ద్వారా ఖర్చు చేసే విధానాన్ని తరిగి కొనసాగించాలి. పాత పద్ధతిలోనే పంచాయతీలకు ఉచిత విద్యుత్‌ను అందించాలి.ఇలా 12 డిమాండ్లతో సర్పంచ్‌లు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వ తీరుపై .. ఉద్యమానికి రంగం సిద్ధం
రాష్ట్రంలో రోజురోజుకూ గ్రామ పంచాయతీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సర్పంచ్‌లకు ప్రాధాన్యత తగ్గిపోతుంది, అందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే కారణమంటూ సర్పంచ్‌లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని, అందులో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్చించాలని యోచిస్తున్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమానికి రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement