అమరావతి – ఆంధ్రప్రదేశ్ గవర్నర్, జస్టిస్. ఎస్ అబ్దుల్ నజీర్ నేడు కడుపు నొప్పి కారణంగా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో చేరారు. మణిపాల్ హాస్పిటల్ వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్యపరీక్షల్లో గవర్నర్ అక్యూట్ అపెండిసైటిస్ తో బాధ పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం గవర్నర్ .కి రోబో సాయంతో ‘అపెండెక్టమీ’ అనే సర్జరీ చేశారు. సర్జరీ విజయవంతం అయినట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు మణిపాల్ హాస్పిటల్ వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు..
గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా – త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం వైయస్.జగన్ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం అస్వస్థతకు గురైన గవర్నర్ విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే సీఎం- అధికారులతో మాట్లాడారు. గవర్నర్‌కు అపెండిసైటిస్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలియజేశారని సీఎంకు అధికారులు తెలిపారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు