న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ రెడ్డి (వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన రెండు వారాల మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చిన రాఘవ రెడ్డిని జూన్ 12న లొంగిపోవాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తాజా ఉత్తర్వులిచ్చింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను పూర్తిగా రద్దు చేయడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది.
మాగుంట రాఘవ రెడ్డి తన అమ్మమ్మ గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆమెను చూడడం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాఘవ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు 2 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆదేశాలను రద్దు చేయాల్సిందిగా ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.
మధ్యంతర బెయిల్ పొందడం కోసం నిందితులు కథలు అల్లుతున్నారని, మాగుంట రాఘవ మొదట రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా స్పెషల్ కోర్టు తిరస్కరించిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో మరో పిటిషన్ వేశారని, ఈ అంశం గురించి బేరీజు వేయాలని హైకోర్టు చెప్పడంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. మొత్తంగా ఈడీ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, మధ్యంతర బెయిల్ రద్దు చేయకుండా సవరణ మాత్రమే చేసింది.