Thursday, November 21, 2024

విపత్తు నిధుల దారిమళ్లింపుపై సుప్రీం చీవాట్లు.. ఇదే చివరి అవకాశమంటూ వార్నింగ్

న్యూఢిల్లీ, ప్రభన్యూస్ : విపత్తు నిధుల దారిమళ్లింపు ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోసారి చీవాట్లు పెట్టింది. ఈ ఆరోపణలపై వివరణనిస్తూ దాఖలు చేయాల్సిన అఫిడవిట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండడంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఇదే నెల 13న కోవిడ్-19 మృతులకు పరిహారం అంశంపై విచారణ సందర్భంగా నిధుల దారిమళ్లింపు అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. కోవిడ్-19 మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన ఎక్స్‌గ్రేషియా నిధులను రైతుల సబ్సిడీకి దారిమళ్లించినట్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి. మొత్తం రూ. 1,100 కోట్ల మేర నిధులు దారిమళ్లినట్టు వచ్చిన ఆరోపణలపై వివరణనిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజంగానే నిధులు దారిమళ్లించినట్టయితే, తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

విచారణ సందర్భంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధులు (SDRF) నుంచి నిధులను ఎక్కడికీ దారిమళ్లించలేదని, 2018లో రైతులకు మంజూరు చేసిన కరవు పరిహారం కోసం మాత్రమే ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. అన్ని వివరాలను అఫిడవిట్లో పేర్కొంటామని, అయితే రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి అందుబాటులో లేకపోవడం వల్ల దాఖలు చేయడంలో ఆలస్యం జరుగుతోందని వివరించారు. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి తండ్రి అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఆయన విధులకు హాజరుకాలేకపోయారని చెప్పారు. ఆయన ఆమోదం లేకుండా అఫిడవిట్ దాఖలు చేయలేకపోయామని వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్ ఎం.ఆర్ షా… ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఆర్థిక శాఖ కార్యదర్శా అని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఆఫీసును తన వెంట తీసుకెళ్లారా? హాస్పిటల్‌లో చేరింది ఆర్థిక శాఖ కార్యదర్శి కాదు కదా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. అఫిడవిట్‌ను చీఫ్ సెక్రటరీ దాఖలు చేయాలని ఆదేశం. ఇదే చివరి అవకాశమంటూ ధర్మాసనం హెచ్చరించింది. తదుపరి విచారణ మే 13కు వాయిదా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement