Saturday, November 23, 2024

Delhi: ర‌ఘురామ‌ పిటిష‌న్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు.. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి కేసులో చుక్కెదురు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి కేసులో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ కే. రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం శుక్ర‌వారం కొట్టేసింది. త‌న‌పైనా, త‌న కుమారుడిపైనా న‌మోదైన కేసును కొట్టేయాలంటూ ర‌ఘురామ‌కృష్ణరాజు ఇటీవ‌లే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు రాగా, రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా పోలీసు శాఖ తరఫున కీలక వాదనలు వినిపించారు.

ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ర‌ఘురామ‌రాజు అనుచ‌రులు ఇంట్లో బంధించి హింసించార‌ని, దానికి సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని పోలీసుల త‌ర‌ఫు న్యాయవాది పేర్కొన్నారు. రఘురామకృష్ణ రాజుకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందితో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేయించారని, దాడికి పాల్పడిన సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెండ్ అయ్యారని వెల్లడించారు. అదే స‌మ‌యంలో అద‌నపు స‌మాచారం కోసం ర‌ఘురామ‌రాజు న్యాయవాది మ‌రింత గ‌డువు కోరారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. “కేసు ఎఫ్ఐఆర్‌ ద‌శ‌లోనే ఉంది క‌దా..? విచారణ జరగనివ్వండి” అని వ్యాఖ్యానించింది. ఇలాంటి ద‌శ‌లో కేసును కొట్టివేయాల‌ని కోర‌డం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ దశలో రఘురామ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేస్తున్నట్టు ప్రకటించగా, పిటిషనర్ తరఫు న్యాయవాది కేసును ఉపసంహరించుకుంటామని తెలిపారు. గ‌తంలో హైకోర్టులోనూ రఘురామకృష్ణ రాజుకు ఇదే తరహా ఫలితం ఎదురైంది. తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేశారంటూ రఘురామకృష్ణ రాజుతో పాటు ఆయన కుమారుడిపైనా గచ్చిబౌలీ పోలీసు స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement