Thursday, November 21, 2024

Followup: జగన్ ఆస్తుల కేసులో హెటిరో సంస్థకు చుక్కెదురు.. క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో హెటెరో సంస్థకు చుక్కెదురైంది. తమపై దాఖలైన కేసులను క్వాష్ చేయాలంటూ హెటెరో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసులో సీబీఐ చార్జిషీటు పక్కాగా ఉందని, ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో హెటెరో కంపెనీ విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది.

గత ఏడాది నవంబర్‌లో తెలంగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డితో పాటు హెటిరో గ్రూప్‌ను కేసు నుంచి తొలగించేందుకు నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో హెటిలో సవాల్ చేసింది. వరుసగా ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో హెటెరో గ్రూపునకు నిరాశ కలిగించే ఫలితమే ఎదురైంది.

అరబిందో, హెటిరో సంస్థలకు జడ్చర్ల సెజ్‌లో భూ కేటాయింపుపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో శ్రీనివాస్‌రెడ్డి, హెటిరో సంస్థను నిందితుల జాబితాలో సీబీఐ చేర్చిన విషయం తెలిసిందే. సీబీఐ అభియోగాల్లో నిజం లేదని, జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు వ్యాపార వ్యూహాల్లో భాగమేనని, భూ కేటాయింపుల్లో అక్రమాలేవీ జరగలేదని హెటిరో తరపు న్యాయవాదులు వినిపించారు. జగన్‌ ప్రమేయంతో అప్పటి వైఎస్‌ సర్కారు హెటిరో సంస్థకు తక్కువ ధరకు భూమిని కేటాయించిందని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

- Advertisement -

జగన్ సంస్థల్లో హెటిరో 2006, 2007లో రెండు దఫాలుగా పెట్టుబడి పెట్టిందని, అదే సమయంలో ఆ సంస్థకు వైఎస్ ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందని సీబీఐ చెబుతోంది. 2008లో మరోసారి పెట్టుబడి పెట్టిన తర్వాతే 75 ఎకరాల భూమి కేటాయించారన్నారు. ఈ వ్యవహారంలో హెటిరో ఎండి శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించారు కాబట్టే ఆయనను నిందితుడిగా చేర్చామని స్పష్టం చేశారు.

హెటెరో సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఎఫ్.ఐ.ఆర్ లో హెటెరో సంస్థ మొత్తాన్ని చేర్చడం న్యాయవిరుద్ధమని అన్నారు. హెటెరో కంపెనీలో పనిచేసే వ్యక్తులపై కేసు పెట్టొచ్చు కానీ కంపెనీపై కాదని వాదించారు. అయితే ధర్మాసనం ఈ వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. జగన్ కంపెనీ ప్రారంభించకముందే ఆయన కంపెనీలో ఒక్కొక్క షేర్‌పై రూ. 350 అదనంగా ప్రీమియం చెల్లించి హెటెరో సంస్థ పెట్టుబడులు పెట్టిందని, ఇదంతా కూడా హెటెరో సంస్థకు స్థలాన్ని కెటాయించినందుకే జరిగిందని సీబీఐ చేస్తున్న వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. హెటెరోపై దాఖలైన కేసు కొట్టివేయదగినది కాదని, విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement