న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్ర విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస్ కేంద్ర సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. రాజ్యాంగ ధర్మాసనాలు కొన్ని ప్రత్యేక కేసులపై విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది. బుధ, గురువారాల్లో కేవలం నోటీసులు ఇచ్చిన పిటిషన్లపై, తుది విచారణలో ఉన్న పిటిషన్లపై మాత్రమే వాదనలకు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం, రాజ్యాంగ ధర్మాసనాల కారణంగా బుధవారం విచారణకు రావాల్సిన రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్ల విచారణ వాయిదా పడింది.
రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని, దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఉండవల్లి సహా పలువురు వ్యక్తులు పిటిషన్లలో పేర్కొన్నారు. భవిష్యత్‍లో ఏదైనా రాష్ట్ర విభజన జరగాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు, నియమ నిబంధనలు అవసరమని ఆమేరకు కేంద్రానికి తగిన ఆదేశాలివ్వాలని పిటిషన్లలో కోరారు. సుప్రీంకోర్టు తాజా సర్క్యులర్, రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ కారణంగా రాష్ట్ర విభజన కేసుపై తేదీ నిర్ణయించాలని ఉండవల్లి తరఫు న్యాయవాది అల్లంకి రమేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన విజ్ఞప్తితో జస్టిస్ కె.ఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాల ధర్మాసనం పిటిషన్లపై విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది.