Sunday, November 17, 2024

జ‌రిమానా చెల్లిస్తారా లేదా….ఎపి ప్ర‌భుత్వంపై సుప్రీం కోర్టు అస‌హ‌నం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పోలవరం ప్రాజెక్టు పర్యావరణ ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి వట్టి వసంత్‌ కుమార్‌, జమ్ముల చౌదరయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ ఉల్లంఘనలపై గతంలో విధించిన జరిమానా చెల్లించకపోవడాన్ని తప్పుబట్టింది. జరిమానాలు చెల్లించడం మేలు చేయడమేమీ కాదని, ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటు-ందని ఘాటు-గా వ్యాఖ్యానించింది.

పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల పర్యావరణ ఉల్లంఘలను ధృవీకరిస్తూ జరిమానా విధించాలని గతంలో నిపుణుల కమిటీ- సిఫార్సు చేసింది. ప్రాజెక్టు వ్యయం ఆధారంగా రూ.242 కోట్లు- జరిమానా చెల్లించాలంటూ గతంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2022 అక్టోబర్‌ 17న జరిగిన విచారణ సందర్భంగా నిపుణుల కమిటీ- ధృవీకరించిన జరిమానా చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. రూ.242 కోట్లు- పెనాల్టీ విధించాలా? లేదా? అంశంపై తదుపరి విచారణ కొనసాగిస్తామని తెలిపింది. జరిమానా చెల్లింపుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటు-ందని పేర్కొంది. మరోవైపు పురుషోత్తపట్నం రైతులకు ఆరేళ్లుగా నష్టపరిహారం ఇవ్వడం లేదని పిటీ-షనర్ల తరపు న్యాయవాది కే. శ్రవణ్‌ కుమార్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. జోషీమఠ్‌ తరహాలో పోలవరం వద్ద భూమిపైన చీలికలు వచ్చాయని తెలిపారు. తదుపరి విచారణలో అన్ని విషయాలను పరిశీలిస్తామని చెప్పిన ధర్మాసనం విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement