Wednesday, January 15, 2025

Tirumala : శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమ‌ల : పవిత్రమైన ధనుర్మాసం మంగళవారం ముగియడంతో బుధవారం ఉద‌యం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభ‌మైంది.


గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ ఉదయం నుండి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ నుండి యథా ప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభమైంది.

- Advertisement -

తిరుమల శ్రీవారికి గోదా మాలలు..
శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్‌ అమ్మవారు) గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదామాలలు శ్రీవారి మూలవిరాట్‌కు బుధవారం ఉదయం అలంకరించారు.

తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్‌ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవిమాలాలు తిరుపతి నుండి తిరుమల పెద్ద జీయ‌ర్‌స్వామి వారి మఠానికి బుధవారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జీయ‌ర్‌ మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్ కు అలంకరించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయ‌ర్‌స్వామి, చిన్న జీయ‌ర్‌ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, గోవిందరాజ స్వామి ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement