కర్నూలు బ్యూరో : వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరికీ మంచి జరిగిందని భావిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఆదరించండనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా లక్కసాగరం వద్ద హంద్రీ నీవా నుంచి 77 చెరువులకు నీరు ఇచ్చే పంప్ హౌస్ ను లక్క సాగరం వద్ద ఆయన ప్రారంభించారు. అనంతరం డోన్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీ, ఎల్లోమీడియాలపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు జీవోలు తీసుకువచ్చే వారని అదంతా కేవలం హడావిడి కోసమేనని సీఎం జగన్ విమర్శించారు. రాయలసీమ నీటి కష్టాలు తనకు తెలుసని, కరువు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు మెట్ల ప్రాంతాలకు సాగునీరు అందుతుందన్నారు. లక్కసాగరం పంప్‌హౌస్ ద్వారా 77 చెరువులకు నీరు అందుతుందన్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరవులకు నీటి కేటాయింపు జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదన్నారు. ఎన్నికలకు 4 నెలలకు ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలు చేశారన్నారు. ప్రాజెక్ట్ కోసం భూమిని కూడా కొనుగోలు చేయలేదని, కేవలం టెంకాయలు కొట్టడానికి ఏదో నామమాత్రంగా 8 ఎకరాలు కొనుగోలు చేశారన్నారు.
తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూశానన్నారు. అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకున్నానన్నారు. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. హంద్రీనీవాను దివంగత మహానేత వైఎస్సార్ పూర్తి చేశారన్నారు. ఆ మహానేత బిడ్డ హయాంలో ప్రజలకు మంచి జరుగుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలు తీసుకున్నామన్నారు. రూ.253 కోట్లతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశామన్నారు. డోన్, పత్తికొండ నియోజకవర్గాలకు మంచి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను పట్టించుకోని పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టామన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్‌ను వడివడిగా పూర్తి చేస్తున్నామన్నారు. రెండో టన్నెల్ పూర్తి చేసి అక్టోబర్‌లో ప్రారంభిస్తున్నామన్నారు. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది తమ ప్రభుత్వమేనన్నారు.