Friday, November 22, 2024

Support – పారిశుద్ధ్య కార్మికుల సమ్మె జన సేన మద్దతు – దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపిన నాదెండ్ల మనోహర్

తెనాలి, జనవరి 2 ప్రభా న్యూస్ : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గతంలో నాయకులు పాద యాత్రలు చేస్తే ఈ ముఖ్యమంత్రి మాత్రం అబద్ధాలు చెప్పడానికి, ప్రజలను మోసం చేయడానికి పాదయాత్ర చేశార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో పారిశుధ్య కార్మికులు చేపట్టిన దీక్షకు మంగళవారం మనోహర్ జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూఅడిగి అడిగి అలసిపోయిన తరువాతే పారిశుధ్య కార్మికులు తమ హక్కుల కోసం రోడ్డెక్కారని అన్నారు.

నిత్యం పట్టణ పరిశుభ్రత కోసం వారి ప్రాణాలను పణంగాపెట్టి పని చేసే పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.కార్మికులు 8 రోజులుగా దీక్షలు చేస్తున్నా స్పందించని ప్రభుత్వం… స్పందనలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నిజంగా ఇది మనసున్న ప్రభుత్వమే అయితే కార్మికులతో కూర్చొని మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపేదని చెప్పారు. వచ్చేది జనసేన- తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమేనని, పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా, సమాజంలో గౌరవంగా జీవించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, జనసేన నాయకులు హరిదాసు గౌరీశంకర్, పసుపులేటి మురళీకృష్ణ, సి.ఐ.టి.యు. వర్కర్స్ ప్రెసిడెంట్ మంగళగిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement