ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో తామర పురుగు తెగులుతో పంట నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని, అత్యవసర సాయం అందించాలని నరసరావుపేట వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. తెగుళ్ల కారణంగా రైతులు, వ్యాపారులు నష్టపోయిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి అత్యవసర చర్యలు చేపట్టవలసినదిగా అభ్యర్థించారు. మిరప సాగులో గుంటూరు జిల్లా అగ్రగామిగా ఉందని, దేశం మొత్తం మిరప సాగులో 25 శాతం పెరుగుదలతో రూ. 5 వేల కోట్లకు పైగా టర్నోవర్‌తో 40 దేశాలకు పైగా ఎగుమతవుతోందని వివరించారు. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 1.4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరిగినా తెగుళ్లు, అకాల వర్షాలు, తుపానులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, మిగిలిన పంటలనైనా కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ లావు కోరారు.14 వందలకు పైగా హెక్టార్లలో వరి పంట నల్ల తామర తెగులు బారినపడడం వల్ల సుమారు రూ.500 కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా వేసిన విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు.
దిగుబడి కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, అసలు పురుగుల దాడులు ఎందుకు జరుగుతున్నాయో అంచనా వేయడానికి, నివారణ చర్యల గురించి రైతులకు మార్గనిర్దేశం చేయడానికి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ నుంచి నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి పంపవలసినదిగా ఎంపీ సూచించారు. నల్ల తామర ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన పురుగు మందులను అందించి ఏపీ ప్రభుత్వానికి సహాయం చేయాలని శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. జిల్లాలో పీఎం ఫసల్ భీమా యోజన సార్వత్రిక కవరేజీని ముందస్తుగా నిర్ధారించడం ద్వారా పంట నష్టం వాటిల్లినప్పుడు బీమా సదుపాయం ఉంటుందని కేంద్ర మంత్రికి చెప్పారు. నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పాడైపోయిన పంటను సేకరించవలసినదిగా ఎంపీ… నరేంద్ర సింగ్ తోమర్‌కు విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital