అమరావతి, ఆంధ్రప్రభ: జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఆరోగ్య భరోసా దక్కుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించడం, అవసరమైనవారికి గ్రామాల్లోనే క్యాంపులు నిర్వహించి వైద్యం అందించడం, పెద్ద ఆస్పత్రులకు సిఫారుసు చేయడం లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్ లో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం మంత్రి విడదల రజిని శాఖ ఉన్నతాధికారులతో జగనన్న ఆరోగ్య సురక్ష పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో మరో గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి ఏఎన్ ఎంలు, క్లస్టర్ హెల్త్ ఆఫీసర్లకు సమాచారం ఇస్తారన్నారు. తర్వాత ఏఎన్ ఎంలు, సీహెచ్‌వోలు ఇంటింటికీ వస్తారని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. అదే గ్రామం, వార్డుల్లో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తారని చెప్పారు. ఈ శిబిరాలు జరిగే సమయానికి అందరికీ ఆరోగ్య నివేదికలను ఏఎన్ ఎంలు, సీహెచ్‌వోలు సిద్ధం చేసి ఉంచుతారని, ఈ వైద్య శిబిరాలకు స్పెషలిస్టు డాక్టర్లు ఇద్దరు, ఆ మండలంలోని పీహెచ్సీ డాక్టర్లు ఇద్దరు మొత్తం నలుగురు వస్తారన్నారు. రోగులకు అక్కడికక్కడే ఈ శిబిరంలో చికిత్స అందజేస్తారని, ఆరోగ్య సలహాలు సూచనలు ఇస్తారని చెప్పారు.
అవసరమైన వారిని పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స కోసం సిఫారుసు చేస్తారని వెల్లడించారు. కాగా ఈ క్యాంపునకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల నుంచి కూడా ఒక స్పెషలిస్టు డాక్టర్ హాజరవుతారని, మండలానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రోజూ వైద్య శిబిరాలు కొనసాగుతాయని, దీనివల్ల గ్రామాలు, వార్డుల్లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వారి గ్రామాల్లోనే స్పెషలిస్టు వైద్యులతో సత్వర వైద్యం అందుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్, ఎంపీడీవో, పీహెచ్‌సీల వైద్యాధికారులను ఈ కార్యక్రమ నిర్వహణకు బాధ్యులను చేస్తున్నట్లు- చెప్పారు. పట్టణప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ- ఆరోగ్య అధికారి, యూపీహెచ్సీ వైద్యాధికారులను బాధ్యులను చేస్తున్నామన్నారు.
పక్కా ప్రణాళికతో..
ఈ శిబిరాలను 30 రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో నిర్వహించేలా ప్రణాళిక రచించామని చెప్పారు. సెప్టెంబర్ నెలాఖరుకు తొలి శిబిరం ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే నెలాఖరు నాటికి అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాల నిర్వహణ పూర్తవుతుందని వివరించారు. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, కాలేజీలు, సచివాలయాల ప్రాంగణాలు, యూపీహెచ్సీ ప్రాంగణాలు.. ఇలా ఎక్కడ అనుకూల వసతులు ఉంటే అక్కడ ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. తొలుత వాలంటీ-ర్లు ఇంటింటికీ వచ్చి ఆరోగ్యశ్రీ వివరాలతో కూడిన కిట్లను అందజేస్తారని చెప్పారు. ఆ కిట్‌లో ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల వివరాలతోపాటు-, నెట్ వర్కు పరిధిలోని ఆస్పత్రుల జాబితా ఉంటు-ందని వెల్లడించారు.
ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని వాలంటీ-ర్లు గుర్తించి ఏఎన్ ఎంలు ఇళ్లకు వచ్చే షెడ్యూల్, చేసే పరీక్షలు, క్యాంపు నిర్వహించే తేదీ తదితర వివరాలను వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఏఎన్ ఎంలు, సీహెచ్‌వోలు ఇంటింటికీ వచ్చి ఆరోగ్య వివరాలు నమోదు చేస్తారని వెల్లడించారు. అవసరమైన వారికి బీపీ, షుగర్, రక్తపరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. క్యాంపు జరిగేనాటికి రోగులకు సంబంధించిన అన్ని రికార్డులను సిద్ధం చేస్తారని తెలిపారు. ఆ రికార్డులు, రోగుల పరిస్థితిని బట్టి క్యాంపులలో వైద్యులు చికిత్స అందజేస్తారని వివరించారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు గాని, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులు, టీ-చింగ్ ఆస్పత్రులకు గాని కేసులను సిఫారుసు చేస్తారని వివరించారు.
అందుబాటు-లో మందులు, వైద్య పరికరాలు
వైద్య శిబిరం జరుగుతున్న ప్రతి చోటా 105 రకాల ఔషధాలు అందుబాటు-లో ఉంటాయని మంత్రి చెప్పారు. అన్ని రకాల వైద్య పరికాలను కూడా అందుబాటు-లో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయంవతంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలుతీసుకోవాలన్నారు. అందుకోసం వాలంటీ-ర్లు, ఏఎన్ ఎంలు, సీహెచ్‌వోలకు ప్రత్యేక శిక్షణ వెంటనే ఇవ్వాలని చెప్పారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లకు వెంటనే మార్గదర్శకాలు వెళ్లాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కిట్లు-, ఆస్పత్రులకు సత్వరమే చేరాలని చెప్పారు. శిబిరాలు నిర్వహించే ప్రాంతంలో వచ్చిన రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడానికి వీల్లేదన్నారు. అన్ని శిబిరాల్లో భోజన సదుపాయం కల్పించాలని చెప్పారు. మందులు సమయానికి శిబిరాల వద్దకు చేరాలని చెప్పారు. వైద్య పరీక్షలు కూడా పక్కాగా జరగాలన్నారు. పూర్తిస్థాయిలో అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
16 నుంచి ఏఎన్ఎంల సందర్శన
ఇంటింటికి వాలంటీ-ర్ల సందర్శన ఈ నెల 15 నుంచి మొదలు కావాలని లక్ష్యం విధించారు. ఏఎన్ఎంల సందర్శన ఈ నెల 16న ప్రారంభంకావాలన్నారు. మొదటి వైద్య శిబిరం ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30న నిర్వహించాలన్నారు. ఆ తర్వాత నెల రోజుల్లో గా అన్ని సచివాలయాల్లో వైద్య శిబిరాలు పూర్తికావాలని స్పష్టం చేశారు. జగనన్న ఆశయాల మేరకు అధికారులంతా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ జె.నివాస్, కమిషనర్ ఏవీవీపీ వెంకటేశ్వర్లు, ఏపీఎంఎస్ ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీఎంఈ నర్సింహం, డీహెచ్ వి. రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.