Sunday, November 24, 2024

Super Six – తల్లికి వందనం… ఏపీ సర్కారు వినూత్న పథకం


అమలు కోసం కార్యాచరణ ప్రణాళిక
విధి విధానాలు ఖరారు చేసిన యంత్రాంగం
ఎన్నికల హామీల్లోని మరో పథకం అమలుకు సన్నాహాలు
పథకంలో భాగంగా 15వేల సాయం
ఇంటర్​ లోపు విద్యార్థలందరికీ అవకాశం
ఇంట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కిట్స్
75శాతం హాజరుశాతం ఉండాలని ఆదేశాలు
ఆధార్​ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక​
మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

- Advertisement -

ఆంధ్రప్రభ స్మార్ట్‌, విజ‌య‌వాడ ప్ర‌తినిధి :
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ‘‘తల్లికి వందనం’’ కార్యక్రమం అమలుకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే విద్యార్థులకు ‘తల్లికి వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’ అందజేస్తామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం అమలు చేసిందని అది ఇంట్లో ఒక్కరికి మాత్రమే చెల్లించేదని, కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ₹15వేలు ఆర్థిక సాయంతోపాటు స్టూడెంట్ కిట్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. ఆధార్‌ కార్డు ప్రామాణికంగా లబ్ధిరులను ఎంపిక చేయాలని, కచ్చితంగా విద్యార్థి 75శాతం హాజరు ఉండాల్సిందేనని ప్రభుత్వం మార్గదర్శకాలలో వెల్లడించింది.

పథకం అమలుకు మార్గదర్శకాలు..
ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే విద్యార్థులకు ఎన్డీఏ ప్రభుత్వం ‘తల్లికి వందనం’కార్యక్రమం అమలు చేయనుంది. ఈ పథకంలో భాగంగా విద్యార్థి తల్లికి ₹15వేలు ఆర్థిక సాయం ప్రతీ ఏడాది ఇస్తామని హామీ ఇచ్చింది. సూపర్ సిక్స్ హామీల్లో ఈ హామీ ఒకటి. తల్లికి వందనం పథకంలో భాగంగా స్టూడెంట్‌ కిట్ కూడా అందించనుంది. ఇప్పటికే స్కూల్స్ తెరిచిన నేపథ్యంలో ప్రభుత్వం పథకాన్ని అమలు చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందేందుకు ఆధార్‌ కలిగి ఉండాలని ఆదేశించింది. ఆధార్ లేకపోతే ఆధార్ నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆధార్‌ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.

స్టూడెంట్ కిట్ కింద అందించేవి ఇవే..

తల్లికి వందనం పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉండి.. పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి ₹15 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని కండిషన్ పెట్టింది. స్టూడెంట్‌ కిట్‌ కింద ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌ బుక్‌లు, ఆంగ్ల నిఘంటువు ఇవ్వనున్నారు. పాఠశాలలో విద్యార్థి 75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం కింద ₹15,000 అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లికి వందనం, స్కూల్ కిట్ పథకాలు ఆధార్ ధ్రువీకరణ ద్వారా అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆధార్ లేకపోతే ఈ ఐడెంటీ కార్డులు తప్పనిసరి..

తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ వంటి పథకాల ప్రయోజనాలు పొందాలంటే లబ్ధిదారులు కచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే విద్యాశాఖ ద్వారా ఆధార్‌ నమోదు సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో తెలిపింది. ఆధార్‌ వచ్చే వరకు ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి పథకం కార్డు, కిసాన్‌ పాస్‌బుక్, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు లేదా తపాలా పాస్‌బుక్, డ్రైవింగ్‌ లైసెన్సు, వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్‌ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దారు ఇచ్చే పత్రం, విభాగం సూచించే ఏ పత్రాన్నైనా అనుమతిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement