Friday, November 22, 2024

సూపర్ రైడర్స్… సైకిల్ హీరోస్…

మంగళగిరి ఏప్రిల్ 24 ప్రభ న్యూస్- నేటి ఆధునిక సమాజంలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ కు అలవాటు పడి సైక్లింగ్ ను మర్చిపోతున్నారు. శరీరానికి అలసటను దూరం చేస్తున్నారు. అతి సులువుగా వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైకిల్ త్రొక్కటం వల్ల అపరిమితమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు గుంటూరుకు చెందిన బండ్లమూడి సుబ్బయ్య. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో సైక్లింగ్,వాకింగ్ ఆచరిస్తే మేలని వైద్యులు చెప్పిన సలహాలను విని ఆరోగ్యం కోసం కొద్ది దూరం ప్రతిరోజు సైకిల్ తొక్కడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ప్రతిరోజు 100 కిలోమీటర్లు చొప్పున సైకిల్ తొక్కుతూ రికార్డులు సృష్టిస్తున్నాడు.పట్టు దలతో కొనసాగిస్తున్నాడు. సుమారు లక్ష కిలోమీటర్లకు చేరువలో ఉన్నాడు. ఓ ప్రక్క నిర్మాణరంగంలో స్థిరపడి మరో ప్రక్క సైక్లింగ్ పై మక్కువ పెంచుకొని అలవాటుగా మార్చుకున్నాడు. ప్రతిరోజు గుంటూరు విజయవాడ చిలకలూరిపేట నగరాలలో సుమారు నాలుగు గంటల్లోనే 100 కిలోమీటర్ల వరకు సైకిల్ త్రొక్కే ప్రక్రియను పూర్తి చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన సైకిల్ యాత్ర 12 మందితో మొదలు కాగా సుబ్బయ్య ప్రథమ స్థానంలో నిలిచాడు. 20 రోజుల్లో 3,700 కిలో మీటర్లు సైకిల్ త్రొక్కి విజయవంతంగా యాత్రను ముగించి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పటికే 646 సెంచరీలు పూర్తి చేసి 94 వేల కిలోమీటర్లు సైకిల్ త్రొక్కే లక్ష కిలోమీటర్ల కు చేరువలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో లక్ష కిలోమీటర్లకు చేరువలో ఉన్న ప్రథమ వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు.స్త్రావా యాప్ లోనూ సుబ్బయ్య డేటా నమోదయింది.

సూపర్ రాండోనియర్ టైటిల్ సొంతం

అడాక్స్ ఇండియా సంస్థ వారు నిర్వహించిన సైక్లింగ్ పోటీలలో పాల్గొన్న సుబ్బయ్య ప్రతిభ కనబరిచి 40 గంటల లోపు విరామం లేకుండా సైకిల్ త్రొక్కి సూపర్ రాండో నియర్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.వర్చువల్ ఛాలెంజర్స్ లోనూ బహుమతులు సైతం సాధించాడు. కలకత్తా,ముంబై లలో నిర్వహించిన పోటీల్లో సత్తా చాటాడు. తరచూ నిర్వహించే సైక్లింగ్ రైడర్స్ లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలుస్తూ,ట్రోఫీలు,బహుమతులు సాధించి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆదివారం సైకిల్ తొక్కుతూ , తన టీం తో కలిసి మంగళగిరి కొండపై ట్రెక్కింగ్ చేశాడు.

- Advertisement -

సైక్లింగ్ లో అలసట ఉండదు…సుబ్బయ్య..సైక్లిస్ట్

బైక్ పై 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఒళ్ళు నొప్పులు సహజంగా వస్తూ ఉంటాయి. కానీ ఎన్ని వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కినప్పటికీ అలసట ఉండదు. నొప్పులు ఉండవు. కరోనా సమయంలో ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కటం మొదలుపెట్టా. ఇప్పుడు రికార్డుల దిశగా వెళుతున్నా. క్రమం తప్పకుండా సైకిల్ తొక్కటం వల్ల శరీరానికి చక్కటి వ్యాయామం లభిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు ఐదు పదుల వయసు దాటినప్పటికీ నవ యవ్వనంగా కనిపిస్తారు. సైక్లింగ్ తో పాటు ఈత పోటీల్లోనూ అనేక బహుమతులు సాధించా. లక్ష కిలోమీటర్లు పూర్తి చేయాలని లక్ష్యంతో వెళుతున్నా. జూన్ నాటికి లక్ష్యాన్ని సాధించగలనని నమ్మకం ఉంది..

జనరల్ ఫిట్నెస్ కు చాలా మంచిది…డాక్టర్ ఋషీల్ ఐరన్ మ్యాన్

సైక్లింగ్ అంటేనే శరీరానికి శ్రమ. అలాంటిది స్విమ్మింగ్ సైక్లింగ్ రన్నింగ్ మూడు వెంట వెంటనే చేయటం అందులో ఐరన్ మ్యాన్ గా సర్టిఫికెట్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు.ఈ నేపథ్యంలో ఆచరణ సాధ్యం చేసి చూపాడు విజయవాడకు చెందిన డాక్టర్ ఋషీల్. 3.8 కిలోమీటర్లు సముద్రంలో స్విమ్ చేసిన వెంటనే 180 కిలో మీటర్ల వరకు సైక్లింగ్,42 కిలో మీటర్లు రన్నింగ్ చేసి ఐరన్ మ్యాన్ గా సర్టిఫికెట్ పొందారు. ప్రస్తుతం అయా విభాగాల్లో యువతకు శిక్షణ ఇస్తున్నారు. కేవలం సైక్లింగ్ లోనే కాకుండా స్విమ్మింగ్ రన్నింగ్ లో శిక్షణ పొందటం ప్రతిరోజు సాధన చేయటం వల్ల జనరల్ ఫిట్నెస్ కు చాలా మంచిదని డాక్టర్ రుషీల్ తెలిపారు. వీటి వల్ల శారీరక, మానసిక వ్యాధులు దూరమై చురుగ్గా ఉంటారని తెలిపారు.

మహిళలు స్పోర్ట్స్ లోకి రావాలి.కామేశ్వరి

నేను సుందరం హోం ఫైనాన్స్లో క్రెడిట్ మేనేజర్ గా పని చేస్తూ ఉంటాను. కోవిడ్ కు ముందు రన్నింగ్ స్టార్ట్ చేశా.కోవిడ్ తర్వాత నుండి ట్రెక్కింగ్,సైక్లింగ్ కొనసాగిస్తాన్నా. వీటివల్ల దీర్ఘకాలికంగా ఉన్న ఎన్నో వ్యాధులు దూరం అవుతాయి. మహిళలు స్పోర్ట్స్ విభాగంలో ఆసక్తి చూపిస్తూ రాణించాలి. ఒక మహిళ ఫీట్ గా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం స్థాపితం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement