ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ సీఎం చంద్రబాబును కలవాలనుకున్నారు. అయితే, ఆమెకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దక్కలేదు. దీంతో సునీత కృష్ణన్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా అపాయింట్‌మెంట్ కోరుతూ ట్వీట్ చేశారు.
“చంద్రబాబు సర్… ఇలా సంప్రదాయ విరుద్ధ మార్గంలో మీ అపాయింట్ మెంట్ కోరుతున్నాను. మీరు బిజీగా ఉంటారని నాకు తెలుసు. అయితే, రెండు ముఖ్యమైన ప్రతిపాదనలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. వచ్చే వారం నాకోసం 10 నిమిషాల విలువైన సమయాన్ని కేటాయించగలరా? ” అంటూ సునీతా కృష్ణన్ట్వీట్ చేశారు. అపాయింట్‌మెంట్ కోసం సాధారణ పద్ధతిలో ప్రయత్ని్ంచినప్పటికీ కుదరకపోవటంతోనే.. ట్వీట్ చేస్తున్నానని. క్షమించాలని కోరారు.
కాగా, సునీతా కృష్ణన్ ట్వీట్ పట్ల ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆగస్ట్ 13వ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కలుద్దామంటూ రిప్లై ఇచ్చారు. అపాయింట్మెంట్ కోరుతూ ట్వీట్ చేసినందుకు ఫర్వాలేదంటూనే.. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుందంటూ చంద్రబాబు ట్వీట్ ద్వారా సునీతా కృష్ణన్‌కు తెలియజేశారు. ఏపీ ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు తాము కృషిచేస్తున్నామని.. మా అపాయింట్మెంట్ వ్యవస్థలను మెరుగుపర్చడానికి ఏం చేయగలమో కూడా ఆలోచిస్తున్నాం అని చంద్రబాబు బదులిచ్చారు.