Saturday, November 23, 2024

వివేకా హత్య కేసు.. సునీల్ కు నార్కో పరీక్షలు!

మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్​కు రిమాండ్ పొడిగించారు. సెప్టెంబరు 1 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.  సునీల్ యాదవ్‌కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. పులివెందుల కోర్టు మేజిస్ట్రేట్ సెలవుపై వెళ్లడంతో జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి. సునీల్ తరపు న్యాయవాది హితేష్ కుమార్, సీబీఐ అధికారులు హాజరైయ్యారు. కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా సునీల్ ఉన్నాడు. కేసు విచారణ అనంతరం సునీల్‌కు కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 73వ రోజు కొనసాగింది. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డి, అవినాష్‌ రెడ్డి చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి వరసగా రెండోరోజు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన తర్వాత వైఎస్  కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 20 మంది ఘటనా స్థలంలో ఉన్నారు. భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఆరోజు మృతదేహాన్ని చూసేందుకు వెళ్లారు. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో వీరిద్దరూ ఉన్నారు. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి సీబీఐ విచారణకు వెళ్లారు. ఎర్ర గంగిరెడ్డితో వీరికున్న సంబంధాలను బేరీజు వేసుకోవడానికి పిలిచినట్లు తెలుస్తోంది.  భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలను సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో కడపలో సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత కలిశారు.

ఈ వార్త కూడా చదవండిః రేషన్ కావాలా..? అయితే ఇది తప్పనిసరి

Advertisement

తాజా వార్తలు

Advertisement