Monday, December 2, 2024

Suomoto | ఐఏఎస్‌ల జోలికెళ్తే సుమోటో కేసు.. షర్మిల కోరితే భద్రత కల్పిస్తాం

  • మాది మెతక ప్రభుత్వ కాదన్న ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్‌
  • అటవీశాఖ సంరక్షణకు కృషి చేస్తాం
  • ఎలాంటి సంస్కరణలకైనా సిద్ధం
  • కేంద్ర, రాష్ట్ర‌ ప్రభుత్వాలను సాయం కోరుదాం
  • అదనపు నిధులు తీసుకొస్తాం
  • అమరుల స్థూపాలు నిర్మిద్దాం
  • గుంటూరులో అట‌వీ అమ‌రుల సంస్మ‌ర‌ణ స‌భ‌
  • నివాళుల‌ర్పించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రభ స్మార్ట్, గుంటూరు: మాది మంచి ప్రభుత్వమే.. కాని మెతక ప్రభుత్వం కాదు. ఐఏఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతాం.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అడిగితే భద్రత కల్పిస్తాం. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. అధికారుల మీద చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోం. 20ఏళ్లు అధికారంలో ఉంటామ‌ని అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారు. గంజాయి మన్యంతో పాటు రెవెన్యూ భూముల్లో కూడా సాగుచేస్తున్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. దండి మార్చ్ తరహాలో రానున్న కాలంలో పెద్ద స్తూపాలు నిర్మించి అటవీ అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అడవులను కాపాడేందుకు ఎలాంటి సహాయం కావాలన్నా మీకు అందిస్తా. అటవీ అధికారులకు అడవులను రక్షించేందుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం అని ఉప ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు అరణ్యభవన్‍లో అటవీ అమరవీరుల సంస్మరణ సభ ఆదివారం జరిగింది. పోలీసులు అటవీశాఖ అధికారులు ఆయనకు గౌరవ వందనం పలికారు. విధుల్లో ప్రాణాలు అర్పించిన అటవీశాఖ అధికారులు, సిబ్బందికి పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు.

ఐఏఎఫ్‌ల‌కు అండ‌గా ఉంటాం..

అమరవీరుల కుటుంబ సభ్యులను పేరుపేరునా పవన్ కల్యాణ్ పలకరించారు. స్మగ్లర్‌ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 23మంది ఐ.ఏఫ్.యస్ అధికారుల కుటుంబ సభ్యులకు సాయం అందించారు. వీరిలో అన్ని కేటగిరీల సిబ్బంది, అధికారులు ఉన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… అడవులను సంరక్షించడంలో ఐ.ఏఫ్.ఎస్ అధికారుల పాత్ర కీలకమని కొనియాడారు. వీరప్పన్ వంటి వారితో పోరాటం చేసిన ఐ.ఏఫ్.ఎస్ అధికారులు ఉన్నారని గుర్తుచేశారు. వన్య సంపద, వన్య ప్రాణులను కాపాడారని ప్రశంసించారు. ఈ స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించేలా తమ వంతుగా కృషి చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.

- Advertisement -

ఎలాంటి సంస్కరణకైనా సిద్ధం

‘‘రాష్ట్ర అటవీశాఖ తరపున ఆయా కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం. వారి త్యాగాలను స్మరిస్తూ కొంతమంది ఫారెస్ట్ అధికారుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తు తరాలకు ఒక‌ ధైర్యం కలిగించేలా సంస్మరణ దినోత్సవం చేయాలి. చెట్లను నరుకుతుంటే … అడ్డుకుని వారి తలలే బలి ఇచ్చిన చరిత్ర ఐ.ఏఫ్.ఎస్ అధికారులకు ఉంది. ఐ.ఏఫ్.ఎస్ అధికారులు ఎందరో వన్య ప్రాణుల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయారు. అటవీ సంరక్షణ అనేది అందరి కర్తవ్యం. నేటి తరం, భవిష్యత్తు తరాలు కూడా బాధ్యత తీసుకోవాలి. నేను ఈ శాఖ మంత్రిగా ఉన్నంతవరకు ఎంత మేలు‌ చేయగలనో అంతవరకూ నా కృషి ఉంటుంది. 23మంది ఐ.ఏఫ్.ఎస్ అధికారులు బలి అయిన ఘటనకు జ్ఞాపకంగా ఒక స్మృతి వనం ఉండాలని అడిగారు. ఐ.ఏఫ్.ఎస్ అధికారి శ్రీనివాస్ విగ్రహం పెట్టాలని కోరారు. అటవీ శాఖ‌లో ఎలాంటి సంస్కరణలు చేపట్టినా నేను మద్దతుగా ఉంటాను. వీటికి అవసరమైన నిధులు కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడి మంజూరు చేస్తాను’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

మళ్లీ పోలీసుల అత్యుత్సాహం

గుంటూరు అగ్రనేతలు వస్తుంటే.. గుంటూరు పోలీసుల అత్యుత్సాహం టాప్ గేర్ లోకి చేరుతుంది. ఇటీవల మాజీ సీఎం జగన్ ప్రభుత్వ ఆసుపత్రికి రాగా.. ట్రాఫిక్ కంట్రోల్ అదుపు తప్పింది. ఫలితంగా ఆసుపత్రికి చేరుకునే రోగులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో పోలీసులు మళ్లీ అదే ధొరణితో ఓ రోగి ప్రాణాల మీదకు తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్ కోసం రహదారిని పోలీసులు బ్లాక్ చేశారు. పవన్ కాన్వాయ్ పోలీసుల వాహనంతో కలెక్టర్ బంగ్లా రోడ్డు నిండిపోయింది. చిలకలూరిపేట నుంచి ఓ రోగినీ గుంటూరులోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. దారి లేక అంబులెన్స్ నిలిచిపోయింది. శ్వాస సంబంధిత ఇబ్బందితో రోగి బాధపడుతున్నట్లు బాధితులు చెప్పారు. శ్వాస అందక అంబులెన్స్ సిబ్బంది సీపీఎస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగానే అంబులెన్స్‌కు దారి ఇచ్చుంటే ప్రమాదం జరిగి ఉండదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది సమయం తర్వాత అంబులెన్స్‌కు పోలీసులు దారి ఇచ్చారు. పవన్ కల్యాణ్ పర్యటనకు అధికారుల ఏర్పాట్లపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి.

అమరుల స్థూపాలను నిర్మిద్దాం

అటవీశాఖలో యోధుల త్యాగాలను చిరస్థాయిగా నిలిచిపోయే లాగా ఏర్పాటు చేస్తాం. సంస్మరణ దినోత్సవాల వల్ల భవిష్యత్ తరాల వారికి త్యాగాల చరిత్ర తెలుస్తుంది’ అని అన్నారు. నా చేతిలో అటవీశాఖ ఉన్నంతవరకు అటవీశాఖ అధికారులు స్వేచ్ఛగా పనిచేయవచ్చు. అటవీశాఖ కోసం, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరిస్తాం. అమరవీరుల స్థూపాలు నిర్మిస్తాం. దండి సత్యాగ్రహం విగ్రహాల స్ఫూర్తితో, అటవీశాఖ అమరవీరుల స్థూపాలు నిర్మిస్తాం. అమరవీరుడు ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement