అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఈ ఏడాది మే 9వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే రెండు నెలల సెలవుల అనంతరం జూలై నాలుగో తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. ప్రతి ఏటా ఏప్రిల్‌లో పరీక్షలు ముగించి, మేలో వేసవి సెలవులు, జూన్ మూడో లేదా నాలుగో వారం నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం జరుగుతోంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లపాటు అకడమిక్ ఇయర్ లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. 2020లో నవంబర్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కాగా.. గతేడాది ఆగస్టు రెండో వారం నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలైంది.
ఈ నేపథ్యంలో పాఠ్యాంశాల సిలబస్‌ను కొంతమేర తగ్గించడంతోపాటు విద్యా సంవత్సరాన్నీ ముందుకు జరపాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది మేలో వేసవి సెలవులు ప్రకటించి, జూలైలో కొత్త విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టాలని విద్యాశాఖ ప్రతిపాదనలు చేసింది. పదో తరగతి విద్యార్థులకు మరో పది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ పరీక్షల విభాగం పలు సూచనలు చేసింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండేళ్లుగా పరీక్షలు పూర్తి స్థాయిలో జరగకుండానే పై తరగతులకు వెళ్లడంతో ఈసారి కొంత మేర ఒత్తిడి ఎదుర్కోనున్నారు. పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 27వ తేదీ నుంచి మే తొమ్మిదో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు ఉంటాయి.
ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షల ఒత్తిడికి గురి కావద్దని, అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవడం, హాల్ టికెట్, ప్రశ్నాపత్రం, జవాబు పత్రాలపై వివరాలను సరిచూసుకోవడం వంటివి చేయాలి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకెళ్లకూడదు. అలాంటివి తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు తమకు ఇచ్చే 24 పేజీల బుక్‌లెట్‌లోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. గతంలోలా అదనంగా పేపర్లు ఇవ్వడం ఉండదు. ఈ ఏడాది నుంచి రెగ్యులర్, ఓపెన్, వొకేషనల్ విద్యార్థులకు ఓఎంఆర్ బార్ కోడ్ ఉండే షీట్లతో జవాబుపత్రాలు అందిస్తారు. కనుక ముందుగా అన్ని వివరాలు సరిచూసుకున్నాకే పరీక్ష రాయడం ప్రారంభించాలి. ప్రీ ఫైనల్ పరీక్షల ప్రశ్నాపత్రాలు కొన్ని జిల్లాల్లో యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడంతో ఫైనల్ పరీక్షల కోసం మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
పరీక్షల అనంతరం సెలవులు..
రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జూలై 4 నుంచి మొదలు కానుంది. పదో తరగతి పరీక్షలు మే 9న పూర్తవగానే వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2(వార్షిక పరీక్షలు) పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు- చేశారు. ఈ పరీక్షలు పూర్తి కాగానే వారికి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. మరోవైపు జూనియర్ కాలేజీలకు మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించిన్నట్లు సమాచారం.