46, 45, 44, 43, 42.. ఇవి పరీక్షల్లో స్టూడెంట్స్ ఉత్తీర్ణత సాధించిన వివరాలు కావు.. వేసవిలో సూరీడు దంచికొడుతున్న ఎండల రికార్డులు. ఈ రికార్డు కాస్త మరో మూడు, నాలుగు రోజుల్లో బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంది. టెంపరేచర్లు 49 డిగ్రీలకు చేరనున్నాయని, పగటి పూట భగ భఘ మంటలు ఖాయమని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పకృతి ప్రకోపం చూపిస్తోంది. భూమ్మీద వేసవి సెగలను తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఉదయం 7గంటలకే ఎండ చుర్రుమంటోంది. వీధుల్లోకి రావటానికి జనం భయపడిపోతున్నారు. ఏ రోజుకారోజు పొట్ట చేత్తో పట్టుకని పనులకు వెళ్లే కూలీనాలీ జనం ఉస్సూరు మంటున్నారు. పలువురు దాతలు ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే నీళ్ల కుండలు ఖాళీ అవుతున్నాయి. పదేళ్ల కిందటి వేసవి టెంపరేచర్ల రికార్డు పునరావృతం అయ్యింది.
హై లెవల్‌కి చేరిన టెంపరేచర్లు
రాత్రి పదిగంటలు దాటినా తగ్గని వడగాలి
పదేళ్ల నాటి చరిత్ర పునరావృతం
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మంటలు
గుడాపూర్‌లో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
ఏపీలోని పల్నాడులోనూ అత్యధికం
6వ తేదీ వరకూ ఇదే తీవ్రత ఉంటుంది
బయటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరిక
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ ప్రతినిధి: ప్రస్తుతం పదేళ్ల కిందటి హైయ్యెస్టు ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. పలు జిల్లాలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల్లో 49కి చేరొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం బయటకు రావాలంటే జంకుతున్నారు. రాత్రి పది గంటలకూ వడగాలి వెచ్చదని తగ్గటం లేదు. దీంతో జనం ఇళ్ల నుంచి కనీసం బయటకు రావటం లేదు.
తెలంగాణలో తల్లడిల్లుతున్న జనం
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు గుడపూర్‌లో 46.6 , చందూర్‌లో 46.5, తిమ్మాపూర్‌లో 46.4 (నల్గొండ), వెల్గటూర్ 46.4 (జగిత్యాల), ముత్తారం 46.4 (పెద్దపల్లి), మంగంపేట్ 46.5 (ములుగు), భద్రాచలం 46.5 (భద్రద్రి కొత్తగూడెం), మహబూబ్ బాద్, వనపర్తి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట్, నాగర్ కర్నూల్, మునగాల 46.5 (సూర్యాపేట్), ఖానాపూర్ 46.4 , వైరా 46.4 (ఖమ్మం) ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నిజమాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి .
ఏపీలో జనం బేజారు
పల్నాడు జిల్లా కొప్పునూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. తిరుపతి జిల్లాలోని మంగనెల్లూరులో 46, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పదేళ్ల తర్వాత చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6, ప్రకాశం జిల్లా ఎండ్రవల్లిలో 45.5, కడప జిల్లా సింహాద్రిపురంలో 44.9, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6 , అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 44.5, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది . రాష్ట్రంలోని 21 జిల్లాలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. రేపు (శుక్రవారం) కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని 265మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 30వ తేదీ ఉష్ణోగ్రతల్లో పదేళ్ల కాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 4 రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఈ నాలుగు రోజులూ జాగ్రత్త.. బయటకు రావొద్దు
మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది. ఈ నెల 6వ తేదీ వరకు కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ సూచించింది. మే 4వ తేదీ వరకు జార్ఖండ్‌లో.. మే 3వ తేదీ వరకు కేరళ, తమిళనాడులో ఎండల తీవ్రత ఉంటుంది. మే 5వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్రలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
విస్తరించిన ధ్రోణి.. ఉరుములు, మెరుపులతో వానలు
ఈశాన్య బంగ్లాదేశ్‌పై తుపాన్ ప్రభావం ఉంది. బీహార్ నుంచి నాగాలాండ్ వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈశాన్య అసోం మీద తుఫాన్ ప్రభావం ఉంది. బంగాళాఖాతం నుంచి ఈశాన్య భారతదేశం వరకు బలంగా వీస్తున్నాయి. దీంతో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాల, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతోపాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వివరించారు.