Thursday, December 19, 2024

AP | కష్టపడితే విజయం మీ సొంతం.. విద్యార్థులతో నారా భువనేశ్వరి

  • విజన్ తో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చు
  • ఐటీ రంగంలోనూ మహిళలు రాణించడం సంతోషకరం
  • నిత్యం ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబే నాకు స్పూర్తి
  • కుప్పం డిగ్రీ కాలేజీ విద్యార్థులతో నారా భువనేశ్వరి ముఖాముఖి


కుప్పం, డిసెంబర్ 19(ఆంధ్రప్రభ) : పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే విజయం మన సొంతమవు తుందని, ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మన దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్నారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గురువారం ముఖాముఖి నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు.

విద్యార్థులను చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయని ఆమె తెలిపారు. విద్యార్థులను చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. నేనూ మీలాగే సరదాగా గడిపాను. కాలేజ్ డేస్ లైఫ్ అంతా గుర్తుంటాయి. నేను చదువుకుంటూ ఉండగా 19 ఏళ్లకే పెళ్లి చేశారు. నాకు ఆ వయసులో ఏమీ తెలీదు. నా భర్త చంద్రబాబు నాయుడు నాపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఒక చాలెంజ్ గా తీసుకుని పనిచేశాను. విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థానాలకు వెళ్లాలని కోరారు. ఆటపాటలే కాదు కెరీర్ పైనా విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విజయం ఊరికే ఏమీ రాదని కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదన్నారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఉన్నత స్థానాలకు మనం చేరుకోగలమన్నారు.

విజయానికి షార్ట్ కట్ లేదని, విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చునని ఆమె అన్నారు. నేను నా కుమారుడు లోకేష్ కి కూడా అదే చెప్పేదాన్ని అని తెలిపారు. అదేవిధంగా అన్ని రంగాల్లోనూ మహిళలదే హవా అని, ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవాళ్లని, తర్వాత పరిస్థితులు మారాయని, అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారని ఆమె పేర్కొన్నారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, ఐటీ రంగంలో కూడా మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారని, మగవారితో సమానంగా ప్రతిభ కనబరుస్తున్న విషయం గుర్తు చేశారు.

- Advertisement -

కుప్పం అభివృద్ధి మా బాధ్యత..
చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ప్రజలకు సేవ చేయాలని తపిస్తారని, ఇప్పుడు స్వర్ణాంధ్ర-విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళుతున్నారని నారా భువనేశ్వరి తెలిపారు. పేదరికం లేని సమాజమే ఆయన లక్ష్యమని చంద్రబాబు ను సొంత బిడ్డగా భావిస్తూ ఆయనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం మేము తీర్చుకోలేమని ఆమె తెలిపారు. రాబోయే ఐదేళ్లలో కుప్పంను అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం డిగ్రీ కాలేజీ ఆవరణలో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భువనేశ్వరి హామీ ఇచ్చారు. అనంతరం కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్, సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement