విజయనగరం : శివారు భూములకు కూడా సాగునీరు అందేవిధంగా, సాగునీటి కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సాగునీటి కాలువల అభివృద్ది పనులపై ఛైర్పర్సన్ తన ఛాంబర్లో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఎకరాకూ సాగునీరు అందించేందుకు కృషి చేయాలని జడ్పీ ఛైర్మన్ కోరారు. తోటపల్లి, గడిగెడ్డ, ఆండ్ర, తాటిపూడి, తారకరామ తీర్ధసాగర్ కాలువ పనుల ప్రగతిని తెలుసుకున్నారు. సాగునీటి కాలువలు ఉన్నచోట, ఈ కాలువ పనులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాలువలు లేనిచోట మేజర్, మైనర్ చెరువు పనులను, ఫీడర్ కెనాల్ పనులను చేపట్టాలని సూచించారు. కాలువలు, చెరువుల్లో జంగిల్ క్లియరెన్స్, పూడిక తీత పనులను చేపట్టాలన్నారు. పనులు నిర్వహించేందుకు ఇదే తగిన సమయమని, ఈ మూడు నెలల్లోనే అత్యంత వేగంగా పనులు నిర్వహించి పూర్తి చేయాలని సూచించారు. ఇరిగేషన్, ఉపాధి హామీ అధికారులు కలిసి సమన్వయంతో పనిచేసి, వర్షాలు ప్రారంభమయ్యేలోగా పనులను పూర్తి చేయాలని చెప్పారు. కాలువల్లో చెత్త వేయకుండా చూడాలని, ఇప్పటికే కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పి డిప్యుటీ సిఈఓ కె.రాజ్‌కుమార్, డిపిఓ శ్రీదర్రాజా, ఇరిగేషన్ ఈఈ రామచంద్రరావు, డిఎల్డిఓ లక్ష్మణరావు, ఉపాధిహామీ ఎపిడిలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement