అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు పంట కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. పేపర్ పరిశ్రమకు ముడిసరుకుగా ఉపయోగపడే సుబాబుల్, జామాయిల్‌కు కనీస మద్దతు ధరపై తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నకు శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాలయ సమయంలో మంత్రి కన్నబాబు సమాధానమిచ్చారు. ఇప్పటికే వాటి కటింగ్ ఆర్డర్ కోసం ఆర్బీకేల ద్వారా నమోదు చేసే పద్ధతిని చేపట్టామన్నారు. వీటికి అత్యధిక రేట్లు వచ్చేలా చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఇటీవల సమావేశం నిర్వహించామన్నారు. గతంలోనే తాను ఛైర్మన్‌గా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటైందన్నారు. కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో కాగితపు పరిశ్రమ తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొంటుందన్నారు.
ఇప్పటికే కంపెనీలను ఆర్బీకేలను అనుసంధానం చేస్తున్నట్లు చెప్పిన మంత్రి కన్నబాబు సీఎం యాప్ ద్వారా కొనుగోళ్లకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రైతులకు సమీకృత సేవలు అందించేందుకే ఆర్బీకేల ఏర్పాటు అని మంత్రి పేర్కొన్నారు. ఆర్బీకేల పనితీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వచ్చినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం కూడా ఆర్బీకేల నిర్వహణపై ఆరా తీసిందన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆసక్తి చూపుతూ పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల అధికారులు ఆర్బీకేల పనితీరును గవర్నర్‌కు వివరించగా తొందరలోనే ఒక ఆర్బీకేను సందర్శించనున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారన్నారు. ఆర్బీకేల ద్వార అన్ని వరి సహా పలు రకాల పంటలతో పాటు కనీస మద్దతు ధర పొందే ఇతర పంటలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు. పంటల నమోదు ప్రక్రియను ఆర్బీకేల ద్వారా చేపట్టడంతో పాటు బీమా పరిహారం కూడా అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..