Sunday, November 24, 2024

స్టూడెంట్స్​ సేఫ్​.. ఉక్రెయిన్​ నుంచి మరో 11 మంది విద్యార్థుల రాక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : యుద్ధ భూమి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా సోమవారం మరో రెండు విమానాలు ఢిల్లీకి చేరుకోగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది విద్యార్థులున్నారు. ఉదయం రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి చేరుకున్న ప్రత్యేక విమానంలో 5 మంది చేరుకోగా, వారిలో ఇద్దరిని తిరుపతికి, మరో ఇద్దరిని హైదరాబాద్ అక్కణ్ణుంచి అక్కడే టికెట్లు బుక్ చేసి పంపించారు.

ఇంకొక విద్యార్థిని ఏపీ భవన్‌కు తరలించి, సాయంత్రం విజయవాడ విమానానికి టికెట్లు బుక్ చేసి పంపించారు. సాయంత్రం ఢిల్లీ చేరుకున్న విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులను గుర్తించిన ఏపీ భవన్ అధికారులు, వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. స్వస్థలాలను తెలుసుకుని, ఆ మేరకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఆపరేషన్ గంగ చేపట్టిన తర్వాత 28 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు.

సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నవారిలో ఏపీ విద్యార్థులు:

  1. సుధేశ్ మోహన్ నట్ల (ఒంగోల్)
  2. ప్రియాంక జాగర్లమూడి (తిరుపతి)
  3. శ్రీ చైతన్య తేజ అంబాలకర (తిరుపతి)
  4. హనీషా యన్నం (హైదరాబాద్)
  5. అజంతా తలకర్ల (హైదరాబాద్)

సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నవారిలో ఏపీ విద్యార్థులు:

1 కొల్లి గోపీకృష్ణ (గుంటూరు)

- Advertisement -
  1. బాబా సొహైల్ గడారపు (అనంతపురం)
  2. బొంగి యోగి (విశాఖపట్నం)
  3. విష్ణువర్ధన్ గోపాలం (గుంటూరు)
  4. హర్షవర్ధన్ (కడప)
  5. ఆవుల యశశ్రీ ఋషిత సరోజ (విజయవాడ)

సరిహద్దుల్లో సమస్యలు:
యుద్ధభూమి నుంచి భారత్ చేరుకున్న విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఉక్రెయిన్-రొమేనియా దేశ సరిహద్దుకు భారీ సంఖ్యలో జనం చేరుకోవడంతో రద్దీ ఏర్పడిందని, శరణార్థులుగా మారి దేశాన్ని విడిచివెళ్తున్న ఉక్రెయిన్ వాసులను బోర్డర్ దాటించడంపై ఎక్కువ దృష్టి పెట్టిన ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్స్, విద్యార్థులను గేట్ దాటనివ్వలేదని చెప్పారు. దీంతో రద్దీ బాగా పెరిగిపోయి, తోపులాట చోటుచేసుకుందని చెప్పారు. ఈ తోపులాటలో చాలా మంది విద్యార్థులు తమ లగేజిని వదిలేయాల్సి వచ్చిందని చెప్పారు. రెండు దేశాల్లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది తమ శాయశక్తులా సహకరించారని, కానీ రద్దీ కారణంగా చాలా మంది విద్యార్థులు అతి శీతల వాతావరణంలో బోర్డర్ వద్ద పడిగాపులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement