Friday, November 22, 2024

మత్తు మాయలో విద్యార్థులు….పట్టించుకోని ఉపాధ్యాయులు

తాడేపల్లిలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మత్తు పదార్థాలు సేవిస్తుండగా స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. ఇద్దరు విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయుని ఎదుట హాజరు పరిచారు. వైట్ నర్, సొల్యూషన్, చేతి రుమాలులో చుట్టి పీలుస్తూ మత్తులో విద్యార్థులు తూగుతున్నారు. అయితే
మత్తులో తూగుతున్న విద్యార్థులను అప్పగిస్తే ఆ ఉపాధ్యాయుడు తేలిగ్గా తీసుకున్నాడు.దీనితో ఉపాధ్యాయుడు తీరుపై స్థానికులు మండిపడ్డారు. ఆ తరువాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు…మత్తు పదార్థాలు సేవించిన విద్యార్థులు చెప్పిన వివరాలతో ఆశ్చర్యపోయారు. తామే కాదు తమతో పాటు చాలామంది విద్యార్థులు ఇదే విధంగా మత్తు ఇచ్చే పదార్థాలు సేవిస్తున్నటట్లు చెప్పారు. ఇక్కడ ఇంత జరుగుతున్నా… తమ దృష్టికి రాలేదని ప్రధాన ఉపాద్యాయులు చెప్పటం గమనార్హం.

విద్యార్థులకు మత్తు ఇచ్చే పదార్థాలు ఎవరు విక్రయిస్తున్నారో విచారించాల్సిన పోలీసులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు కౌన్సెలింగ్ తోనే సరిపెటారు. ఇంకా ఎంత మంది విద్యార్థులు మత్తుకు అలవాటు పడ్డారో గుర్తించపోతే,వారి బంగారు భవిష్యత్తు బుగ్గి పాలు అవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి ప్రాంతంలో ఇప్పటికే అనేక మంది యువకులు గంజాయికి బానిసలుగా మరి తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఇటీవల పోలీసులు దాదాపుగా 50 మంది యువకులను విచారణ జరిపారు. గంజాయి విక్రయిస్తూ, సేవిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలు మరువక ముందే పాఠశాల విద్యార్థులు మత్తులో జోగుతున్నారనే నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు తల్లిదండ్రులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement