నంద్యాల బ్యూరో, డిసెంబర్ 2 : రైలు ఢీకొని విద్యార్థి దుర్మరణం పాలైన సంఘటన నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం జరిగింది. రైల్వే ఎస్సై అబ్దుల్ జలీల్ తెలిపిన వివరాల మేరకు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న సతీష్ అనే గిరిజన విద్యార్థి ఇవాళ ఉదయం రైలు ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడని తెలిపారు.
పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో ప్రథమ సంవత్సరం చదువుతున్న సతీష్ అనే గిరిజన విద్యార్థి స్థానిక బొమ్మల సత్రం సమీపంలోని ఎస్టీ హాస్టల్ లో ఆశ్రయం పొందుతున్నాడు. అయితే సోమవారం ఉదయం కాలకృత్యాలను తీర్చుకునేందుకు సమీప రైల్వే ట్రాక్ పై వెళ్తుండగా అకస్మాత్తుగా వెనక నుండి వచ్చిన రైలు విద్యార్థిని ఢీకొనడంతో తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుకున్నట్లు ఎస్సై అబ్దుల్ జలీల్ తెలిపారు.