Tuesday, November 26, 2024

AP | దసరా ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు.. విధుల్లో 6044 మంది సిబ్బంది

అమరావతి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 15వ తేదీ ఆదివారం నుంచి ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా ఉత్సవాల వేడుకలకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈనెల 23వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా తెలంగాణా, కర్నాటక రాష్ట్రాల నుండి అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. లక్షలాదిగా చేరుకునే భక్తులు, యాత్రికుల భద్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా విజయవాడ పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.

దీనిలో భాగంగా బందోబస్తు విధులకు మొత్తం 6044 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని వినియోగిస్తోంది. ఇందుకుగాను ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తోంది. వీఐపిలు, ప్ర ముఖుల భద్రతోపాటు ట్రాఫిక్‌ నియంత్రణ, నేరాల నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. తొమ్మిది రోజుల పాటు షిఫ్టుల పద్దతిలో అధికారులు, సిబ్బందికి బందోబస్తు విధుల కేటాయింపు జరిగింది. వివిధ జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు.

విధుల్లో పాల్గొనే సిబ్బందికి విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా దసరా బందోబ స్తుపై మార్గదర్శకాలు జారీ చేశారు. తొమ్మిది రోజులపాటు దసరా విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది ప్రవర్తించాల్సిన తీరు, ప్రజలు, యాత్రికులు, భక్తుల పట్ల వ్యవహరించాల్సిన విధానంపై దిశానిర్ధేశం చేశారు. దసరా ఉత్సవాలకు ప్రత్యేక విశిష్టత, ప్రాధాన్యత దృష్ట్యా రోటీన్‌ బందోబస్తు మాదిరిగా కాకుండా మనసు పెట్టి శ్రద్ధతో విధులు నిర్వహించాలని ఉపదేశించారు.

- Advertisement -

అప్పుడే భక్తుల మన్ననలతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నారు. యూనిఫాంలో విధులు నిర్వహించే సమయంలో ఇతరులు మనల్ని గమనిస్తుంటారనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, బందోబస్తు నిర్వహించే సందర్భంలో మార్గ దర్శకాలు విధిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా బందోబస్తు విధులకు సంబంధించి మూడు షిప్టుల విధానం అమలు చేస్తున్నారు. దీని వల్ల అధికారులు, సిబ్బందికి వెసులుబాటు కలగడంతోపాటు మరింత సమర్ధవంతంగా బందోబస్తు విధులు నిర్వహించేందుకు వీలుండేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది ఇతర శాఖల సిబ్బందితో, వి.ఐ.పి.లతో వివాదాలకు తావులేకుండా సమన్వయం చేసుకోవడం అత్యంత ప్రధానమైన అంశంగా సూచించారు. దర్శనానికి విచ్చేసే సాధారణ భక్తులకు మొదటిగా ప్రాధాన్యత ఇచ్చి అధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కూడా వారితో మర్యాధగా వ్యవహరిస్తూ సక్రమంగా అమ్మవారి దర్శనం అయ్యేలా చూడాల్సిన అవశ్యకత బందోబస్తు విధుల్లోని సిబ్బందికి వివరించారు.

క్యూలైన్లలో ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. దసరా ఉత్సవాల బందోబస్తు విధుల్లో ఉండే సిబ్బంది, అధికారులకు ప్రధానంగా తమకు కేటాయించిన డ్యూటీ పాయింట్‌లోనే ఉండాలి. తమ విధుల సమయం ముగిసే వరకూ ఉన్న చోటు నుంచి కదలకూడదు. తమ విధులు ముగిసినా రిలీవర్‌ వచ్చే వరకు పాయింట్‌- వదలి వెళ్ళకూడదని సీపీ స్పష్టం చేశారు.

అలా కాదని వ్యవహరించినా, అక్కడ ఏదైనా జరిగినా అందుకు అక్కడున్న డ్యూటీ సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బందోబస్తులో ప్రధానపాత్ర వహించే సెకార్డ్‌ ఇన్‌ఛార్జ్‌లు అప్పటికప్పుడు జరిగే సంఘటనలను అంచనా వేసి చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. సిబ్బందికి ఏవైనా సందేహాలు, సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత సెక్టార్‌ ఇన్‌ఛార్జ్‌కు లేదా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. బందోబస్తు సందర్భంగా మనస్ఫూర్తిగా పని చేస్తే ఉత్సవాలు విజయవంతం అవుతాయని తద్వారా ఆయా యూనిట్లతో పాటు పోలీస్‌శాఖకు మంచి పేరు వస్తుందని పోలీస్‌ కమీషనర్‌ సూచించారు.

మొత్తం ఉత్సవాల విధులు ఒక ఎత్తయితే, మూలా నక్షత్రం, తెప్పోత్సవం సమయంలో పోలీసు శాఖ మరింత అప్రమత్తం కానుంది. మూలా నక్షత్రం రోజున భక్తుల సంఖ్య పెరగడంతోపాటు ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని మరింత కట్టుదిట్టంగా ప్రణాళిక సిద్ధం చేసింది. అదేవిధంగా తెప్పోత్సవం రోజున ఎలాంటి తొక్కిసలాటలు, ఇతర ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టనుంది. భద్రతతోపాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement