Friday, November 22, 2024

డాక్టర్లకు స్ట్రిక్ట్​ రూల్స్​.. గంట గంటకు సెల్ఫీ అప్​లోడ్​ చేయాలన్న ఆరోగ్యశాఖ కమిషనర్​

ఏపీ ప్రభుత్వ వైద్యుల్లో కొత్త కలవరం మొదలైంది. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కంఠమనేని భాస్కర్‌ ఇచ్చిన కొన్ని ఆదేశాలే ఆ కలవరానికి, కలకలానికి కారణం. ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న వైద్యులందరూ అటెండెన్స్‌ కోసం బయోమెట్రిక్ కచ్చితంగా వాడాలి. దాంతోపాటు ఆస్పత్రిలోనే ఉన్నాం అని చెప్పేలా గంటగంటకీ ఓ సెల్ఫీ సంబంధిత వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చెయ్యాలి. ఈ ఆదేశాలే ఇప్పుడు ఏపీలోని వైద్యులకు మింగుడు పడడంలేదు. తాజాగా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు కమిషనర్ కంఠమనేని భాస్కర్‌. వైద్యులు అందుబాటులో ఉండడంలేదని, వైద్యం సరిగా అందడంలేదని చాలా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో భాస్కర్ కొన్ని ఆదేశాలిచ్చారు.

ప్రతీఒక్కరు బయోమెట్రిక్ వాడాలి. దాంతోపాటు గంటగంటకూ సెల్ఫీ అప్‌లోడ్ చెయ్యాలి. ఆ సెల్ఫీ కూడా ఎక్కడో తీసిందికాదు.. ఆస్పత్రి ప్రాంగణం, తమ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్లుగా చూపించేదిగా ఉండాలి. ఈ ఆదేశాలతో ఒక్కసారిగా వైద్యుల్లో దడ మొదలైంది. కొందరు అనుమానిస్తున్నారా, అవమానిస్తున్నారా అంటూ ప్రతిఘటిస్తుంటే… మహిళా డాక్టర్లు మాత్రం ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు ఫోటోలు అప్‌లోడ్ చేస్తే సెక్యూరిటీ ఎలా ఉంటుందంటూ ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండడంలేదని, వైద్యం అందండలేదని వస్తున్న ఫిర్యాదులకు విరుగుడుగా భాస్కర్, సెల్ఫీల అప్‌లోడ్‌ నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి ఇది వైద్యులకు ఎందుకు మింగుడుపడడంలేదన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న వెర్షన్. మరి ఈ ఇష్యూ మున్ముందు ఇంకెన్ని టర్నింగులు తీసుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement