ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కడప జిల్లా పోలీస్ శాఖ ఈరోజు నుంచి కఠినంగా కరోనా నిబంధనలు అమలు చేయబోతోంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, ధరించని వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. హోటల్ నిర్వాహకులు హోటల్‌లో సర్వర్లు, ఇతర ఉద్యోగులు ఖచ్చితంగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. అలాగే పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించే ఫంక్షన్ హాళ్లలో ప్రభుత్వ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చూడాలని, పరిమితికి మించి జన సమూహం చేరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. దుకాణ యజమానులు తమ షాపుల ఎదుట సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ వేయాలని, షాప్ ఎదుట తాడు కట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై డీఎం యాక్ట్ (డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్) కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital