వన్యప్రాణులను వేటాడడం.. చంపడం.. అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అడవులు, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మనది వసుధైక కుటుంబమని.. భూమ్మీద మనతో పాటు మనుగడ సాధిస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదుల పట్ల కరుణ చూపాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
వన్యప్రాణుల సంరక్షణ కోసం సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అటవీశాఖ యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్‌ను విడుదల చేశారు. వన్యప్రాణుల వేట లేదా అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే యాంటీ-పోచింగ్ సెల్‌కు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 18004255909 ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ‘‘వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను వేటాడడం, చంపడం, అక్రమ రవాణా చేయడం నిషిద్ధం, ఎవరైనా వన్యప్రాణులను వేటాడి, అటవీ సంపదను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
మాది బాధ్యతగల ప్రభుత్వం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా అటవీశాఖ అధికారులు విధులకు కట్టుబడి ఉందని తెలిపారు. ఇటీవల చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుతపులిని చంపిన నిందితులను అటవీశాఖ అధికారులు మూడు రోజుల్లో పట్టుకుని రిమాండ్‌కు తరలించామని.. పల్నాడు జిల్లాలో అరుదైన జంతువును చంపిన నిందితులను రోజుల వ్యవధిలోఅదుపులోకి తీసుకున్నారని పవన్ అన్నారు.
వన్యప్రాణులను ఎవరైనా వేటాడినా, చంపినా, అక్రమంగా రవాణా చేసినా అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం 18004255909 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. అటవీ సంపదను ఎవరైనా నాశనం చేసినా, అక్రమ మైనింగ్‌కు పాల్పడిన అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అనంతరాము, పీసీసీఎఫ్ శ్రీ చిరంజీవ్ చౌదరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు శ్రీ ఎ.కె. నాయక్, శ్రీ శరవణన్, శ్రీ రాహుల్ పాండే, శ్రీమతి శాంతిప్రియ పాండే తదితరులు పాల్గొన్నారు.