Tuesday, November 26, 2024

రైల్వేస్టేషన్లలో మహిళల భద్రతకు పటిష్టచర్యలు.. ఏపీ మహిళా కమిషన్‌కు జీఆర్‌పీ నివేదిక..

అమరావతి, ఆంధ్రప్రభ : రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో మహిళల భద్రతకు ప్రభుత్వ రైల్వే పోలీసు (జిఆర్‌పి) పటిష్ట చర్యలు చేపట్టింది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే పోలీసు రాష్ట్ర మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించింది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలపై పెరిగిపోయిన లైంగిక దాడులు, ఇటీవల పల్నాడు, బాపట్ల జిల్లాల్లో గురజాల, రేపల్లె రైల్వేస్టేషన్‌ లలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ తీవ్రంగా స్పందించి మహిళా భద్రతపై రైల్వేపోలీసు శాఖకు నోటీసులు పంపింది. శాఖాపరమైన చర్యలను బాధ్యులు వ్యక్తిగతంగా హాజరై మహిళా కమిషన్‌ కు వివరించాలని నోటీసులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో రైల్వేస్టేషన్లలో మహిళలకు సంబంధించి ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారో తెలియచేయాలని ప్రభుత్వ రైల్వేపోలీసులను మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. దీంతో భద్రతకు సంబంధించి చేపట్టే పటిష్ట చ ర్యలు, ప్రణాళికకు సంబంధించిన నివేదిక జిఆర్‌పి సిద్ధం చేసింది. ఈమేరకు సోమవారం మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే డీఐజీ రమేష్‌ చంద్ర, గుంటూరు రైల్వే డివిజన్‌ ఏడీఆర్‌ఎం ఆర్‌. శ్రీనివాసులు, డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ కె. హరిప్రసాద్‌ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మను కలిశారు. ఈ సందర్భంగా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు రైల్వే పోలీసు ఉన్నతాధికారులు నివేదిక అందజేశారు. గురజాల రైల్వే హాల్టు, రేపల్లె ఘటనలపై వివరణ ఇచ్చారు. రైల్వే స్టేషన్లు, వాటి పరిసర ప్రాంతాల్లో తాము చేపట్టిన భద్రతా చర్యలపై దృష్టి పెట్టామన్నారు. గస్తీ, పెట్రోలింగ్‌ షిప్ట్‌n విధానం, సిబ్బంది వివరాలను వాసిరెడ్డి పద్మ అడిగి తెలుసుకున్నారు.

సమన్వయంతో గస్తీ ముమ్మరం చేయండి..

లోకల్‌ పోలీసు, జిఆర్‌పి, రైల్వే పోలీసులు సమన్వయం చేసుకుంటూ రాత్రి, పగలు గస్తీ మరింత పటిష్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అధికారులకు సూచించారు. నిర్మానుష్యమైన ప్రదేశాల్లో పెట్రోలింగ్‌ వాహనాలు గస్తీ నిర్వహించి, ప్రయాణికులకు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. సిసి కెమెరాల ద్వారా ప్రయాణికుల రాకపోకలు గమనించి, సిసి కెమెరాలు లేని చోట తప్పకుండా అమర్చి, అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టి, నేరాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా రైల్వేస్టేషన్లలో సంబంధిత పోలీస్‌ అధికారులు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని సూచించారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘాపెట్టి నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అందరూ సమష్టిగా కార్యాచరణ రూపొందించి మహిళలకు రక్షణ కల్పించాలని వాసిరెడ్డి పద్మ కోరారు. ప్రతి రైల్వేస్టేషన్‌ పరిధిలో రాత్రిపూట గస్తీలు అమలయ్యేలా బీట్లు- వేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కాగా భవిష్యత్తులో ఆర్పీఎఫ్‌, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలకు మహిళా కమిషన్‌ భాగస్వామ్యం కావాలని రైల్వే ఉన్నతాధికారులు కోరగా, వాసిరెడ్డి పద్మ సుముఖత వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement