ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం ఇవ్వాల (శనివారం) సాయంత్రం విశాఖ చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే.. ఆయనకు ఆ పార్టీ శ్రేణుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. అదే సమయంలో విచిత్ర పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. శనివారం సాయంత్రం చీకటిపడే సమయంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్, ఎయిర్ పోర్టు నుంచి బీచ్ రోడ్డులోని నోవాటెల్ కు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పవన్ ర్యాలీ సాగే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా స్ట్రీట్ లైట్లు బంద్ అయ్యాయి. అయినా వెనక్కు తగ్గని పవన్ కల్యాణ్ చీకట్లోనే ర్యాలీతో ముందుకు సాగారు. రేపు విశాఖ పోర్టులోని కళావేదికలో జనసేన ఉత్తరాంధ్ర జనవాణిని పవన్ నిర్వహించనున్నారు.
ఇక.. విమానాశ్రయం నుంచి నోవాటెల్ కు బయలుదేరిన పవన్ వెంట భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరాయి. పవన్ కాన్వాయ్‌కు ముందుగా జన సైనికులు బైక్ ర్యాలీతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా స్ట్రీట్ లైట్లు వెలగని విషయాన్ని గమనించిన జనసేన శ్రేణులు తమ సెల్ ఫోన్లలోని లైటింగ్‌ను ఆన్ చేశారు. ఈ సెల్ ఫోన్ల లైటింగ్‌లోనే పవన్ ర్యాలీ ముందుకు సాగింది.