తెర మీదకు సీబీఈటీ
ప్లాస్టిక్ రహిత మన్యమే ధ్యేయం
అడవి సంరక్షణ.. పర్యావరణ పరిరక్షణ నిర్వహణ బాధ్యత
అల్లూరి ఏజెన్సీలో రెండు చెక్ పోస్టులు
లైట్ వెహికల్స్ కు రూ.50లు
హెవీ వెహికల్స్ కు రూ.100లు వసూలు
ఈ నెల 22 నుంచి షురూ
” ఇక కాలుష్య రహిత, పర్యావరణ సంహిత, అభయారణ్యమే ధ్యేయంగా .. ఏకో టూరిజం అభివృద్ధి లక్ష్యంతో ప్లాస్టిక్ లేని ప్రాంతంగా అడవి తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్ల్ఓ అటవీ శాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. మన్యం ప్రాంతాన్ని ఫ్లాస్టిక్ రహిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పర్యావరణ పరిరక్షణ సంకల్పంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, చింతూరు డివిజన్లలోని పాపికొండల అభయారణ్యంలో రెండు పర్యావరణ పరిరక్షణ చెక్ పోస్టుల ఏర్పాటునకు అటవీశాఖాధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. ఒక రకంగా ఇవి ఎకో ఫ్రెండ్లీ టోల్ గేట్ లుగా భావించవచ్చు. ఏంటీ? ఏజెన్సీలోనూ రోడ్లకు టోల్ గేట్ వసూలు చేస్తారా? అనే ప్రశ్న తలెత్తటం ఖాయం. కానీ నిధుల కొరతతో నీరసించిన అటవీశాఖకు ఈ టోల్ ఆదాయమే ఓ టానిక్ అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను, కాలుష్య నిర్మూలనకు, పచ్చని అడవిని ప్లాస్టిక్ పాలు కాకుండా కాపాడుకోవటం అనివార్యం. అందుకు నిధుల సమీకరణకు ఈ సీబీఈటీ అత్యవసరం
ఆంధ్రప్రభ స్మార్ట్, చింతూరు (ఏఎస్ఆర్ జిల్లా)
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం ఏజెన్సీలో రెండు ఎకో ఫ్రెండ్లీ సీబీఈటీ చెక్ పోస్టుల ఏర్పాటునకు అటవీ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పర్యావరణ చెక్ పోస్టుల ఏర్పాటునకు ప్రతిపాదనలు పూర్తి చేసి ఈ వారంలో చెక్ పోస్టులను నెలకొల్పటానికి అధికారులు సర్వసన్నద్ధం అయ్యారు. రాజమహేంద్రవరం సర్కిల్ లోని రంప చోడవరం, చింతూరు అటవీ డివిజన్ల పరిధిలోని చింతూరు, మారేడుమిల్లి మండలాల్లో రెండు పర్యావరణ నిర్వహణ ఛార్జీల చెక్ పోస్టు (తనిఖీ కేంద్రాలను) ఏర్పాటు చేయనున్నారు. చింతూరు డివిజన్ లోని లక్కవరం అటవీ క్షేత్ర పరిధిలో లక్కవరం సెక్షన్, లక్కవరం బీట్‌లోని చదలవాడ గ్రామ పంచాయతీలోని తులసీపాక గ్రామంలో ఒక చెక్ పోస్టును, రంపచోడవరం అటవీ డివిజన్ లోని మారేడుమిల్లి అటవీక్షేత్ర పరిధి మారేడుమిల్లి బీట్‌లోని మారేడుమిల్లి గ్రామంలో మరోక చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ప్లాస్టిక్ రహిత పాపికొండలే ధ్యేయం
పాపికొండల అభయారణ్యాన్ని డిసెంబర్ నాటికి ఫ్లాస్టిక్ రహిత ప్రాంతంగా చేయాలని.. ఇందుకు అనుగుణంగా ఎకో ఫ్రెండ్లీ సీబీటీ చెక్ పోస్టుల నిర్వహణకు అటవీ శాఖ నాంది పలికింది. అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ఈ చెక్ పోస్టులు దొహదపడతాయి. ఈ చెక్ పోస్టుల నుంచి వచ్చే నిధులతో అడవుల్లో పర్యాటకులు, ప్రజలు, ప్రయాణికులు విసర్జించే చెత్త చెదారం, ఫ్లాస్టిక్ వస్తువుల నియంత్రణ ప్రధాన ధ్యేయం. అగ్నిప్రమాదాలపై నివారణకు అప్రమత్తత, పర్యావరణ పరిరక్షణకు ఈ నిధులను ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
పర్యావరణ నిర్వహాణ ఛార్జీలు ఇలా
అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం అటవీశాఖ అధికారులు సీబీఈటీ (కమ్యూనిటీ అధారిత ఏకో టూరిజం) ద్వారా నడిచే పర్యావరణ నిర్వహాణ ఛార్జీల తనిఖీ కేంద్రాల్లో కారు, జీపు, బోలేరు, టెంఫోలు తదితర వాహనాలకు రూ. 50లు వసూలు చేస్తారు, లారీ, ప్రైవేట్ బస్సులు, ఐషర్ వ్యాన్లు, ఇతర భారీ వాహనాలకు రూ. 100లు వసూలు చేస్తారు. చింతూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే వాహనాలకు తులసీ పాక చెక్ పోస్ట్ వద్ద, రాజమండ్రి నుంచి చింతూరు వైపు వచ్చే వాహనాలకు మారేడుమిల్లి చెక్ పోస్ట్ వద్ద ఈఎంసీ ఛార్జీలు వసూలు చేస్తారు.
ఏపీలో ఇప్పటికే పర్యావరణ చెక్ పోస్టులు
దేశంలో పలు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో సైతం ఇప్పటీకే పర్యావరణ నిర్వహాణ ఛార్జీల చెక్ పోస్టులు నడుస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రస్తుతం శ్రీశైలం అభయారణ్యంలో ఈ చెక్ పోస్టులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీ కేంద్రాలు ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో, అభయారణ్య ప్రాంతాల్లో, ఎకో టూరిజం ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన్యంలోని పాపికొండల అభయారణ్య ప్రాంతంలో ఏర్పాటునకు అటవీ అధికారులు సిద్దమయ్యారు. ఈ చెక్ పోస్టులలో వలంటీర్లను నియమిస్తారు. అడవుల్లో పేరుకు పోతున్న ఫ్లాస్టిక్, చెత్త చెదారాన్ని తొలగిస్తారు. ఫ్లాస్టిక్‌ని రీసైకిల్ అవకాశాలనూ అధికారులు పరీశీలిస్తున్నారు. సీబీటీల్లో లభించే ఆదాయాన్ని వన్య ప్రాణుల అభివృద్ధికి, వన్య ప్రాణుల అవాసాల పునరుద్ధరణకు. కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చి దిద్దుతారు.
ప్రజలు సహకరించాలి : బబిత, డీఎఫ్‌వో, చింతూరు డివిజన్
అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న పర్యావరణ నిర్వహాణ తనిఖీ కేంద్రాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్రజలు, ప్రయాణికులు, వాహన చోదకులు చెక్ పోస్ట్ అవశ్యకతను అర్ధం చేసుకొని అటవీశాఖ అధికారులకు సహకరించాలి. సీబీఈటీ నుంచి వసూలు చేసే నిధులను పర్యావరణ పరిరక్షణకు వినియోగిస్తాం. ఈ డిసెంబర్ నాటికి పాపికొండల అభయారణ్య ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహిత జోన్‌గా చేయడానికి అడుగులు వేస్తున్నాం. ఈ నెల 22 నుంచి పర్యావరణ నిర్వహాణ ఛార్జీల చెక్ పోస్టులను ప్రారంభించి వాహనదారుల నుంచి రూ. 50 నుంచి 100 రూపాయాల వరకు వసూలు చేస్తాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకొని సహకరించాలి.