అనంతపురం బ్యూరో, ఆగస్టు 28 (ప్రభ న్యూస్) : తాడిపత్రిలో ఇసుక మాఫియాను అరికట్టాలని జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్పీ జగదీష్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి మెమొంటో తో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల తీరులో ఇంకా మార్పు రాలేదన్నారు. ఒకరిద్దరి పోలీసుల వల్ల మొత్తం జిల్లా పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారని విమర్శించారు. తాడిపత్రి ఇసుక మాఫియా గురించి ఎన్జీటీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
ఇసుక అక్రమ రవాణా గురించి ఒక ప్రత్యేక టీం ను ఏర్పాటు చేయమని అడిగినా ప్రయోజనం లేదని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా గురించి నెల రోజుల నుంచి లెటర్లు రాస్తున్నా పట్టించుకోలేదన్నారు. ఎవరూ స్పందించక పోవడం వల్ల స్వయంగా తానే రంగంలోకి దిగినట్లు తెలిపారు. తాడిపత్రిలో ఇసుక దందాను కొనసాగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరినట్లు తెలిపారు. ఇంకా కొంతమంది పోలీసులు వైసీపీ జెండాను కప్పుకొని డ్యూటీ చేస్తున్నారని ఆరోపించారు.