Monday, November 25, 2024

మూడు పార్టీల మ‌ధ్య స్టిక్క‌ర్ల యుద్ధం…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు మరో ఏడాది కాలంపైగా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ప్రధాన పార్టీల మధ్య స్టిక్కర్ల యుద్ధం ఎన్నికల వాతావరణాన్ని మరిపిస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల మధ్య స్టిక్కర్ల కార్యక్రమం కొత్త యుద్ధాన్ని తలిపిస్తోంది. వాస్తవానికి ఇంటింటికీ స్టిక్కర్లు అనే కార్యక్రమాన్ని మొదట ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డే అంకురార్పణ చేశారు. గడప గడపకు వైయస్సార్‌, మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్‌ నువ్వే జగనన్న అనే నినాదాలతో గత కొంతకాలంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు ఆయా నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటించి స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గత నెల 16వ తేదీ నుండి మరింత వేగవంతం చేశారు. గత ఏడాది మే 11వ తేదీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలోనే స్టిక్కర్ల కార్యక్రమాన్ని ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. వంద రోజులు కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న కొంత మంది నేతలు తమ నియోజకవర్గాల్లో ఇంటంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ స్టిక్కర్లు అంటిస్తూ వస్తున్నారు. అదే సందర్భంలో కొన్ని జిల్లాల్లో జనసేన కూడా కాబోయే సీఎం పవన్‌ కల్యాన్‌ అంటూ స్టిక్కర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాజాగా తెలుగుదేశం కూడా సైకో పోవాలి .. సైకిల్‌ రావాలి.. మళ్లిd చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి అనే నినాదాలతో స్టిక్కర్లు తయారుచేసి ఇంటింటికీ అంటించే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీల మధ్య స్టిక్కర్ల రాజకీయం ఊపందుకున్నట్లయింది. రాజకీయ రాజధాని బెజవాడలో టీడీపీ ఈకార్యక్రమాన్ని మరింత సవాల్‌గా తీసుకుంది. వైసీపీ అంటించిన స్టిక్కర్లకు పక్కనే టీడీపీ స్టిక్కర్‌ను కూడా అంటిస్తుండటంతో విజయవాడ రాజకీయం మరింత వేడెక్కుతోంది.

మూడు పార్టీల్లో .. కాక పుట్టిస్తున్న పోరు
రాష్ట్రంలో గత కొంతకాలంగా వైసీపీ, తెలుగుదేశం, జన సేన వంటి ప్రధాన పార్టీలతోపాటు బీజేపీల మధ్య వివిధ అంశాలపై ఆదిపత్య పోరు సాగుతుంది. ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీల మధ్య పెద్ద ఎత్తున యుద్ధమే నడుస్తోంది. అనేక సందర్భాల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళనలు, నిరసన కార్యక్ర మాలను కూడా చేపడుతూ వస్తోంది. టీడీపీ ఆందోళ నకు నిరసనగా అనేక జిల్లాల్లో అనేక సంద్భాల్లో వైసీపీ నేతలు కూడా నిరసనలను చేపడుతూ వస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్ర మాలకు సంబంధించిన అంశాలపై చోటుచేసుకున్న విమ ర్శల సందర్భంగా జరుగుతున్న ఆందోళనలే. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకోసం చేపట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు మంత్రులు, శాసనసభ్యులను రోజుకు 8 గంటలు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. అందులో భాగం గానే ప్రతి ఇంటికీ స్టిక్కర్లు అంటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదిశగా నవర త్నాల మధ్యలో సీఎం బొమ్మ ఉండేలా స్టిక్కర్‌ఒను తయారుచేసి జగనన్న .. నువ్వే .. మానమ్మకం అంటూ నినాదాన్ని కూడా స్టిక్కర్‌లో ఉంచారు. ఆతరహా స్టిక్కర్లను వైసీపీ నేతలు ప్రతి ఇంటికీ వెళ్లి అంటిస్తున్నారు. దీంతో ప్రజల్లో వైసీపీకి గ్రోత్‌ పెరు గుతూ వస్తుంది. ఈనేపథ్యంలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా జోరు పెంచారు. టీడీపీ నేతలంతా రోజుకు 10 గంటలు ప్రజల్లో ఉండాలని ప్రతి ఒక్కరూ చమటోడ్చి కష్టపడాలని సొంత పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రస్థాయి సమావేశంలోనూ ఆయా జిల్లాలకు వెళ్లిన సందర్భంలోనూ ఇదే అంశా న్ని సూచిస్తూ వస్తున్నారు. దీంతో తాజాగా టీడీపీ కూడా స్టిక్కర్ల బాట పట్టింది. కృష్ణా జిల్లాలో లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో మాజీ మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌ ఛార్జిలు ఎనిమిది నినాదాలతో స్టిక్కర్లను తయారుచేసి అంటిస్తు న్నారు. మరోవైపు జనసేన కూడా స్టిక్కర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆపార్టీ సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేతంరెడ్డి వినోద్‌ రెడ్డి కాబోయే సీఎం పవన్‌ కల్యాన్‌ అనే నినాదంతో స్టిక్కర్లను తయారుచేసి నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికీ అంటించారు. ఇదే తరహాలో కొన్ని జిల్లాల్లో కూడా జనసేన స్టిక్కర్ల కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో మూడు పార్టీల మధ్య స్టిక్కర్ల యుద్ధం పార్టీ శ్రేణుల్లో కాకపుట్టిస్తుంది.

నినాదాలే వేరు..
అన్ని పార్టీలదీ అదే కార్యక్రమంఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, బంద్‌లు వంటి కార్య క్రమాలతో ప్రతిపక్ష పార్టీలు తమ సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నంగా ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేనలు స్టిక్కర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. నినాదాలు వేరైనా టీడీపీ, జనసేన, వైసీపీలు మూడు పార్టీలు స్టిక్కర్లతోనే ప్రజల ముందుకు వెళ్తున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో మాత్రమే వాల్‌ పోస్టర్లు అంటించే వారు. ప్రస్తుతం తమ పార్టీలక సంబంధించిన వివిధ నినాదాలతో అందమైన స్టిక్కర్లను తయారుచేసి ప్రతి ఇంటికీ అంటిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ స్టిక్కర్లు పక్కపక్కనే అంటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement