Tuesday, November 26, 2024

ఎయిడెడ్‌ విలీనం దిశగా అడుగులు, ఎన్‌రోల్‌మెంట్‌ తక్కువ ఉంటే అంతేసంగ‌తి..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వంలోకి విలీనం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది. అందుకోసం పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రాతిపదికగా తీసుకుంటామని, ఆర్టీఈ చట్టం మేరకు గతంలో వచ్చిన జీవోల ప్రకారం విలీనాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకోనుంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంటూ.. ఆయా విద్యాసంస్థలు సిబ్బంది, ఆస్తులతో సహా ప్రభుత్వంలోకి విలీనం చేయాలని సూచిస్తూ గతేడాది ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతోపాటు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయా పిటిషన్లను విచారించిన ఉన్నత న్యాయస్థానం విలీనం అనేది స్వచ్ఛందమేనని, బలవంతంగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం సరికాదని పేర్కొనడంతోపాటు, ఎయిడెడ్‌కు ప్రస్తుతం కొనసాగుతున్న గ్రాంటును విడుదల చేయాలని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో విలీనమైన పాఠశాలలు మినహా మిగిలినవి ఎయిడెడ్‌గా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో గత మూడేళ్లుగా ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని, 40 మంది కన్నా తక్కువ ఉంటే వాటిని ప్రభుత్వంలోకి విలీనం చేసే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 840 ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 418 పాఠశాలలు ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడంలో విఫలమయ్యాయని, కనుక 1994 జనవరి 1న జారీ చేసిన జీవో నం.1లోని రూల్‌ 10(17) ప్రకారం ఆయా విద్యాసంస్థలు విలీనాన్ని అంగీకరిస్తున్నట్లు ఆమోదపత్రాన్ని అందజేయాలని ఆర్జేడీలు, డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

మెరుగుపరుచుకోవాలని గతేడాదే సూచనలు..

2019- 20, 2020- 21 విద్యా సంవత్సరాల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ తక్కువగా ఉన్న విద్యాసంస్థలు తమ పనితీరును మెరుగు పరుచుకోవాలని నోటీసులు జారీ చేయడంతోపాటు నవంబర్‌ 30 వరకు విద్యాశాఖ గడువునిచ్చింది. అనంతరం గడువును అక్టోబర్‌ 31 వరకు పొడిగించింది. ఆ సమయంలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగేలా విద్యాసంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించింది. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య 40కి మించని ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వంలోకి విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను పరిశీలించి మొత్తం 840 పాఠశాలల్లో 418 స్కూల్స్‌ విద్యార్థుల సంఖ్యను పెంచడంలో విఫలమైనట్లు గుర్తించారు. వీటి విలీనంపై విద్యాశాఖ అవసరమైన చర్యలు తీసుకోనుంది.

విలీన ఉపాద్యాయులకు ఆరోగ్య కార్డులివ్వాలి: టీచర్స్‌ గిల్డ్‌

- Advertisement -

రాష్ట్రంలోని 1910 ఎయిడెడ్‌ పాఠశాలల్లో 6900 మంది టీ-చింగ్‌, సిబ్బంది పని చేసేవారని, విలీనానంతరం 2500 మంది ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు మొదటి కౌన్సెలింగ్లో ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చారని ఆంధ్రప్రదేశ్‌ టీ-చర్స్‌ గిల్డ్‌ ప్రతినిధి సీహెచ్‌ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. తాజాగా విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 400కు పైగా ఎయిడెడ్‌ పాఠశాలలు విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న కారణంగా విలీనం కాబోతున్నాయన్నారు. ప్రస్తుతం ఎయిడెడ్‌ పాఠశాలల్లో 3400 మంది పని చేస్తున్నారని, జీవో నెంబర్‌ 24 ప్రకారం, తాజా ఉత్తర్వుల ప్రకారం రెండు వేల మందిపైన ఉపాధ్యాయులు ప్రభుత్వ సౌకర్యాలు, ఆరోగ్య కార్డులకు అర్హులు అవుతారని, వారందరికీ జారీ చేయాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement