Thursday, November 21, 2024

అన్నప్రసాదం నాణ్యత మరింత పెంచేందుకు పాదవిధానం : టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి : తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించడానికి మిల్లర్ల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లు టిటిడి ఈవో ఏవి.ధ ర్మారెడ్డి చెప్పారు. తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతిగృహంలో మంగళవారం ఈవో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని రైస్‌మిల్లర్ల అసోషియేషన్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ టిటిడి అన్నప్రసాదాలకు, ఇతర అవసరాలకు 2013 నుంచి 2019 వ సంవత్సరం వరకు తెలుగు రాష్ట్రాల్లోని రైస్‌ మిల్లర్ల అసోషియేషన్‌ నుంచి నాణ్యమైన సోనా మసూరా బియ్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 2019 లో ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు టెండర్‌ ద్వారా బియ్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు.

టెండర్‌ ప్రక్రియ ద్వారా బియ్యం కొనుగోలు చేయడం వల్ల వ్యాపారస్తులు, మిల్లర్ల వద్ద కొని టిటిడికి సరఫరా చేస్తున్నారన్నారు. టిటిడి నేరుగా రైస్‌ మిల్లర్ల వద్ద కొనుగోలు చేయడం వలన మరింత నాణ్యమైన బియ్యం అందుతాయని ఆయన చెప్పారు. టిటిడి చైర్మెన్‌ వైవి.సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు అన్నప్రసాదాలను మరింత రుచికరంగా అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మిల్లర్లు వారంరోజుల్లో బియ్యం సరఫరా రేటు తెలియజేస్తామని చెప్పినట్లు తెలిపారు.

ఇటీవల టిటిడి అన్నప్రసాదంలో బియ్యం బాగలేవని భక్తుల నుంచి పిర్యాదులు అందాయన్నారు. ప్రస్తుతం టెండర్‌ ద్వారా వ్యాపారస్తులు రూ.38 రూపాయలకు కేజి బియ్యం అందిస్తున్నారని ఈవో వివరించారు. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థ, ఏపి మార్క్‌ఫెడ్లతో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జేఈవో సదాభార్గవి, డిప్యూటిఈవోలు సెల్వం, పద్మావతి, జిఎం (కొనుగోలు) సుబ్రమణ్యం, జిఎం ప్రాక్యూర్మెంట్‌, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శాస్త్రి, ఇతర అధికారులు, రైస్‌మిల్లర్ల అసోషియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement