అమరావతి, ఆంధ్రప్రభ: పరి’శ్రమ’కు కొత్త రూపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను 2022-23 సంవత్సరం బడ్జెట్‌లో రూ.2,755.17 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఐటీ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. రానున్న రెండు నుంచి ఐదు సంవత్సరాల్లో రూ.500 కోట్ల పైబడి పెట్టుబడులతో 20,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఐటీ రంగం కింద 10 పెట్టుబడి ప్రతిపాదనలు అధునాతన దశలో ఉన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడుల్ని ప్రోత్సహించడం, వ్యవస్థాపకతా సంస్కృతిని పెంపొందించడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫ్రెమ్ వర్క్ కింద అన్ని ఆమోదాలు 21 రోజుల్లో అందించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. త్వరితగతిన అనుమతుల్ని మంజూరు చేయడం ద్వారా పెట్టుబడి దారుల్ని ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందించింది. చిత్తూరు, నెల్లూరు ప్రాంతాలు దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తూ దేశంలో టాప్ టెన్ గమ్యస్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
మెరుగుపడ్డ ర్యాంక్..
గత సంవత్సరానికి సంబంధించిన ఎగుమతుల సంసిద్ధత సూచీని నీతి ఆయోగ్ విడుదల చేయగా రాష్ట్రాల కేటగిరీలో ఏపీ, తెలంగాణ తొలి 10 స్థానాల్లో నిలిచాయి. ఏపీ తన ర్యాంకును మెరుగుపరచుకుంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల సంసిద్ధత సూచీలో ఏపీ ర్యాంకు 20. కాగా ఆ తరువాతి ఆర్థిక సంవత్సరంలో టాప్ 10 లోకి దూసుకెళ్లింది. ఇప్పుడు తొమ్మిదో స్థానంలో నిలిచింది. తెలంగాణలో 10వ స్థానాన్ని ఆక్రమించుకుంది. పొరుగున ఉన్న తెలంగాణ కంటే ఏపీ ముందంజలో ఉందని నీతి అయోగ్ నివేదికలు నిర్ధారిస్తున్నాయి. పాలసీ, వాణిజ్య వాతావరణం, ఎగుమతుల సానుకూలత, ఎగుమతుల పనితీరు వంటి నాలుగు కీలక విభాగాల్లో ఏపీ తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది. ఎగుమతుల్లో 78.86 పాయింట్లతో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, 77.14 పాయింట్లతో మహారాష్ట్ర రెండో స్థానం కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో 61.72 పాయింట్లతో కర్ణాటక, 56.84 పాయింట్లతో తమిళనాడు.. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 5,6,7,8 స్థానాల్లో నిలిచిన హర్యాణా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ ల పాయింట్లను ఏపీ సాధించిన పాయింట్లతో పోలిస్తే కేవలం 1-2 శాతం మాత్రమే వ్యత్యాసం ఉండడం గమనార్హం.
ఎయిర్ కనెక్టివిటీపై దృష్టి..
రాష్ట్రాల్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాలు, పెట్టు బడులు పెట్టడానికి కల్పించిన అనువైన వాతావరణం, ఎగుమతుల లక్ష్యాలు.. వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ ఎగుమతుల సంసిద్ధత సూచిని రూపొందించింది. మౌలిక సదుపాయాలు, రవాణా కనెక్టివిటీ, ఆర్థిక విధానాల సరళీకరణ, పెట్టు బడిదారులు, ఎగుమతిదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, ఆర్ అండ్ డీ.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఎగుమతులలో ఏపీని అగ్రపథాన నిలబెట్టడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఏయిర్ కనెక్టివిటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆర్థిక చెల్లింపులు ముగింపు దశలో ఉండగా, కర్నూలు నుంచి చెన్నై, బెంగుళూరు, విశాఖపట్నం నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇదే తరహాలో కర్నూలు నుంచి తిరుపతి, విజయవాడకు కొత్త మార్గాలను ప్రతిపాదించింది. చైన్నై – కడప – విజయవాడ మధ్య షెడ్యూల్ విమాన సర్వీసుల్ని ప్రారంభించే ప్రతిపాదనల్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...