న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)కు సొంత ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని విశాఖపట్నం ఎంపీ (వైఎస్సార్సీపీ) ఎంవీవీ సత్యనారాయణ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో ఉన్న స్టీల్ ప్లాంట్ యూనియన్ నేతలతో కలిసి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ యూనియన్ నేతల బృందం కేంద్ర మంత్రిని కోరింది. అలాగే 2017 నుంచి ఉద్యోగులందరికీ కొత్త వేతన విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇతర స్టీల్ ప్లాంట్లు ఇప్పటికే ఉన్న బకాయిలు చెల్లించి కొత్త పే-స్కేలు అమలు చేశాయని మంత్రికి వివరించారు.
మరోవైపు పౌరవిమానయాన శాఖ మంత్రిగానూ పనిచేస్తున్న జ్యోతిరాదిత్య సింధియాను విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అన్ని ముఖ్యమైన నగరాలకు మరిన్ని విమాన సర్వీసులు నడిపేలా చర్యలు చేపట్టాలని ఎంపీ సత్యనారాయణ కోరారు. విశాఖపట్నం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్ భవనం ప్రారంభోత్సవానికి రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు.