- రూ.70వేల కోట్లతో నిర్మాణం
- ముందుకొచ్చిన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్స్
- 2029 నాటికి నిర్మాణం పూర్తి
- దీని ద్వారా 25వేల మందికి ఉపాధి
- భూమి కేటాయింపునకు ఓకే
- నక్కపల్లి సభలో చంద్రబాబు ప్రకటన
అనకాపల్లి – నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.. ఈ ప్లాంట్ నిర్మించేందుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారని చెప్పారు.. రూ.70వేల కోట్లతో నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందని,. అక్కడ ఒక పెద్ద సిటీనే డెవలప్ అవ్వబోతుందని వెల్లడించారు.
నక్కపల్లిలో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… ఈ స్టీల్ ప్లాంట్ ప్రకటన చేశారు.. ఇదిలా ఉండగా, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్స్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్ కలిసి రాష్ట్రంలో రూ.70,000 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేశాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ కోసం గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం 2,200 ఎకరాలు భూసేకరణ చేసిందన్నారు. ఆ భూమిని తమకు కేటాయించాలని ఆ రెండు కంపెనీలు విజ్ఞప్తి చేయగా సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి వారికి ఓకే చెప్పారు. భూమి అందుబాటులో ఉంటే వెంటనే ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించి 2029 జనవరి నాటికి మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించగలమని తెలిపాయి.
ఈ ప్లాంట్ నిర్మాణ పనుల ద్వారానే 25,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని, ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తే 20,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మిట్టల్ స్టీల్స్ తెలిపింది. మొదటి దశలోనే రూ.70,000 కోట్లు పెట్టుబడి ఇన్ని వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉండటంతో చంద్రబాబు నాయుడు వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మొదటి దశ ప్లాంట్‌లో ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మించాలని ఆ రెండు సంస్థలు ప్రతిపాదించాయి. ఈ కొత్త స్టీల్ ప్లాంట్‌కి ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి ముడి ఇనుము సరఫరా చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి మిట్టల్, నిప్పన్ కంపెనీలు.. ఇప్పటికే ఎన్ఎండీసీ తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకొని విశాఖలో గల తమ పిల్లెట్స్ తయారీ పరిశ్రమకి ముడి ఇనుము దిగుమతి చేసుకుంటున్నాయి.
దీంతో నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే దానికి ముడి సరుకుగా ఈ పిల్లెట్స్ అందించగలవు. వాటితో పాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ నుంచి ముడి ఇనుము కూడా ఏర్పాటు చేసుకోగలవు. దీని కోసం అవి నక్కపల్లికి సమీపంలో ఓ పోర్ట్ కూడా నిర్మించడానికి 3,000 మీటర్ల పొడవునా సముద్రతీరాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. అంటే ఆ పోర్ట్ నిర్మాణం, నిర్వహణ ద్వారా కూడా వేలాదిమందికి శాశ్విత ప్రాతిపదికన ఉద్యోగాలు, ఉపాది లభించబోతున్నాయి. దీనికి కూడా చంద్రబాబు ఆమోద ముద్రవేశారు.
మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయ్యి ఉత్పత్తి ప్రారంభించేలోగా ప్లాంట్‌లో పనిచేసే ఉద్యోగుల కోసం ఓ టౌన్ షిప్ కూడా నిర్మించాలని భావిస్తోంది. దాని కోసం మరో 440 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఇక మొదటి దశ ప్లాంట్‌లో ఉత్పత్తి మొదలవగానే దానికి సమీపంలోనే సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఏడాదికి 10.5 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో మరో ప్లాంట్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు మిట్టల్, నిప్పన్ కంపెనీలు ప్రభుత్వానికి తెలిపాయి. అప్పుడు దాని కోసం మరో 8,800 ఎకరాలు అవసరం ఉంటుందని తెలిపాయి. ఈ ప్రతిపాదనను ఆమోదించిన చంద్రబాబు నేడు అధికారికంగా నక్కపల్లి సభలో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం గురించి ప్రకటన చేశారు.. అలాగే మిట్టల్ స్టీల్ తో త్వరలోనే ఈ మేరకు ఎంఒయు చేసుకుంటామని చంద్రబాబు చెప్పారు.