Friday, November 22, 2024

Sports too… విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలి – టీజీ వెంకటేష్

కర్నూలు… విద్యార్థులు తమ చదువుతోపాటు ఏదో ఒక క్రీడలో తమ ప్రతిభను పెంచుకుని రాణించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు స్థానిక కిడ్స్ వరల్డ్ నందు జరిగిన కర్నూలు జిల్లా తైక్వాండో ఓపెన్ కాంపిటీషన్ పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, విద్యార్థి దశనుండే క్రీడల అలవర్చుకుంటే క్రమశిక్షణతో పాటు, మేధస్సు కూడా పెరుగుతుంది అన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు, మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందన్నారు. మన రాష్ట్రంలో క్రీడలకు సరైన ఆదరణ లభించడం లేదన్నారు. క్రీడలు ఆడేందుకు అవసరమైన ప్లేగ్రౌండ్స్ గాని, ఇండోర్ స్టేడియంలు గాని, ఆడిటోరియాలు గాని లేకపోవడంతో క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడలలో పాల్గొనలేక పోతున్నారని టీజీ అన్నారు.

అంతేగాక అంతో ఎంతో సౌకర్యాలు ఉన్నటువంటి ప్రభుత్వ స్టేడియాలలో ఆడాలంటే ఎదురు డబ్బులు అడుగుతున్నారని, ఇది దారుణమని టీజీ వెంకటేష్ అన్నారు. క్రీడలు, క్రీడాకారుల ప్రోత్సాహానికి ఖర్చు పెట్టాల్సింది పోయి తిరిగి వారి దగ్గరే డబ్బులు వసూలు చేసే విధానం రావడం వల్ల క్రీడాకారులు తమ ప్రతిభను చాటలేకపోతున్నారని అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన దేశంలోనే ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ, ఎక్కడ స్పోర్ట్స్ జరిగిన పథకాలు తేవడంలో మాత్రం వెనుకబడి ఉన్నామంటే కారణం ఇదే అని టీజీ వెంకటేష్ అన్నారు.

చదువుతో పాటు క్రీడలలో రాణించే విద్యార్థులకు విదేశాలలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శమంతకమణి, డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ అమృత సాయి, టైక్వాండో పోటీల నిర్వాహకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement