అమరావతి, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి చేసిన విద్రోహానికి నిరసనగా ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం తీర్మానించింది. నల్లమడ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. కొల్లా రాజమోహన్ అధ్యక్షతన సమన్వయ సమితి సమావేశం విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో బుధవారం ఉదయం జరిగింది. ముందుగా ఈ సమావేశాన్ని రైతు సంఘం సీనియర్ నాయకులు వై. కేశవరావు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా అడిగిన వివరణ ఇవ్వకుండానే ఏకపక్షంగా 29 మందితో కూడిన పంటల వైవిధ్యాన్ని, ప్రకృతి సేద్యాన్ని పరిశీలించే కమిటీ-ని ఏర్పాటు- చేసిందని, ఈ కమిటీ-యే మద్దతు ధరల గురించి కూడా పరిశీలిస్తుందని పేర్కొందన్నారు.
కమిటీ-ని నల్ల చట్టాలను సమర్థించిన వారితో, బీజేపీ అనుయాయులతో నింపేసిందని ఆరోపించారు. ఆ కమిటీలో చేరబోనని సంయుక్త కిసాన్ మోర్చా నిర్బంధంగా ప్రకటించిందని, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తదితర డిమాండ్ల సాధన కోసం పోరాటం సాగించాలని నిర్ణయించామన్నారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ఆగస్టు 7 నుంచి 14 తేదీల మధ్య యువజన, విద్యార్థి, మాజీ సైనిక సంఘాలను కలుపుకొని జిల్లా కేంద్రాలలో సదస్సులు జరపాలని మరో తీర్మానం చేసింది. ఇందులో భాగంగా ఆగష్టు 14 రాత్రి జన జాగరణ కార్యక్రమం జరపాలని, అట్లాగే ఆగస్టు 15న గ్రామగ్రామాన ‘జె జవాన్-జై కిసాన్’ నినాదంతో జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని సమావేశం నిర్ణయించింది. పాల ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని ఈ నెల 24న ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరపాలని నిర్ణయించింది.
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించ వద్దని జరిగే ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చింది. సమావేశంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి జలమయ్య, ఏఐకెఎమ్ రాష్ట్ర కార్యదర్శి డి.హరనాథ్, ఏఐకెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మర్రేడ్డి వెంకట రెడ్డి, వివిధ సంఘాల నేతలు చెరుకూరి రాజేశ్వరరావు, వెలగపూడి ఆజాద్, చుండూరి రంగారావు, ఎం. హరిబాబు, వేల్పూరి నరసింహారావు, వెలిచెర్ల దుర్గాప్రసాద్, జోన్నా శివశంకర్, పంచకర్ల రంగారావు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.