నందికొట్కూరు రూరల్, జులై 12, (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఎల్లాలకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక ముగ్గురు మానవ మృగాల చేతుల్లో బలైన విషయం పాఠకులకు విధితమే. అయితే 6 రోజులుగా బాలిక మృతదేహం కనిపించలేదు. ఇప్పటికే జిల్లా ఎస్ పి రఘువీర్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారిలు ముచ్చుమర్రి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కాలువ (కృష్ణానది బ్యాక్ వాటర్)లో ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలతో వెతుకుతున్నారు. అయితే రాష్ట్ర శాప్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వాసంతి తల్లిదండ్రులను పరామర్శించేందుకు శుక్రవారం కర్నూలు నుండి ముచ్చుమర్రి గ్రామానికి వెళ్తున్నారు.
అయితే బ్రాహ్మణ కొట్కూరు గ్రామం వద్దకు చేరుకోగానే బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని నందికొట్కూరు రూరల్ సీఐ ఓ విజయ భాస్కర్, బ్రాహ్మణ కొట్కూరు ఎస్ఐ నాగార్జున, జూపాడుబంగ్లా ఎస్ఐ లక్ష్మీనారాయణలు తమ సిబ్బందితో కలిసి ముచ్చుమర్రి గ్రామానికి వెళ్లకూడదని హుకుం జారీ చేశారు. అయితే సిద్దార్థ రెడ్డి వినకుండా తమ గ్రామానికి వెళ్ళి వాసంతి తల్లిదండ్రులను పరామర్శించి వస్తానని చెప్పినా సీఐ, ఎస్ఐ లు వినకుండా అడ్డుకున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే అనుమానంతో సిద్దార్థ రెడ్డిని అరెస్టు చేసి బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా తరలివచ్చారు. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సొంత గ్రామానికి వెళ్ళి వాసంతి తల్లిదండ్రులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదని, సిద్దార్థ రెడ్డిని వెంటనే ముచ్చుమర్రి గ్రామానికి పంపాలని డిమాండ్ చేస్తున్నారు.