తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల జారీ సందర్భంగా అపశృతి జరిగింది. శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం కేంద్రాల వద్ద భక్తులు టోకెన్ల కోసం భక్తులు పోటీ పడడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నలుగురు భక్తులు మరణించారు. ఇందులో తమిళనాడుకు చెందిన భక్తురాలు మళ్లిక అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తొక్కిసలాటలో గాయపడిన వారిని అధికారులు, పోలీసులు రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితుల హాహాకారాలతో రుయా ఆసుపత్రి ఎమర్జెన్సీ ప్రాంగణం గందరగోళంగా మారింది. వైద్యులు వేగంగా స్పందించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వైకుంఠ తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైకుంఠ ద్వార దర్శనం టోకన్లు జారీ చేస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి క్యూ లైన్లలో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి బైరాగి పట్టెడ పార్కు వద్ద భక్తులను క్యూలోకి అనుమతించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తోపులాట జరిగింది.
.