దేవుడా..తిరుపతిలో తొక్కిసలాట..వైకుంఠ ద్వార దర్శన టోకన్ల కోసం పోటెత్తిన భక్తులు తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి .. మరో ఆరుగురికి తీవ్ర అస్వస్థత. మరో 40 మందికి గాయాలు. స్విమ్స్, రుయాలో చికిత్స పొందుతున్న బాధితులు. ముందుగానే టోకన్లు జారీ చేయడంతో ఘటన అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం. టీటీడీ, పోలీసుల సమన్వయలోపంతోనే ప్రమాదం సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల జారీ సందర్భంగా అపశృతి జరిగింది. శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం కేంద్రాల వద్ద భక్తులు టోకెన్ల కోసం భక్తులు పోటీ పడడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఆరుగురు భక్తులు మరణించారు. ఇందులో తమిళనాడుకు చెందిన భక్తురాలు మళ్లిక ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఘటనలో దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని అధికారులు, పోలీసులు రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితుల హాహాకారాలతో రుయా ఆసుపత్రి ఎమర్జెన్సీ ప్రాంగణం గందరగోళంగా మారింది. వైద్యులు వేగంగా స్పందించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వేగంగా స్పందించిన కలెక్టర్, ఎస్పీతోపులాటలో భక్తులు మరణించారనే సమాచారంతో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అధికారులతో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ రుయా ఆస్పత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సైతం బాధితులతో మాట్లాడారు.
ఎస్పీ సుబ్బరాయుడు టోకన్ల జారీ కేంద్రాల వద్ద పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేశారు. జేసీ శుభం బన్సల్, టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో గౌతమి స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో బాధిలను పరామర్శించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
గంటల కొద్ది నిరీక్షణ
వైకుంఠ తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైకుంఠ ద్వార దర్శనం టోకన్లు జారీ చేస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి క్యూ లైన్లలో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి బైరాగి పట్టెడ పార్కు వద్ద భక్తులను క్యూలోకి అనుమతించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తోపులాట జరిగింది
. సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్సపై అధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. జిల్లా, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు.
వైఎస్ జగన్ సంతాపం
తిరుపతిలో జరిగిన దుర్ఘటనపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.