మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్ ఇవ్వాల (బుధవారం) రాత్రి అనంతపురంలో నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో చిరంజీవి చేసిన పొలిటికల్ కామెంట్ ఒకటి వైరలయ్యింది. ఈ ఈవెంట్లో ఏదైనా సంచనల ప్రకటన చేస్తారేమో అన్న ఆశతో అభిమానులు భారీగా తరలివచ్చారు. తిరుపతి ప్రజారాజ్యం సభను మరిపించే లెవల్లో జనం రావడంతో నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తింది.
ఈ క్రమంలో 30వేల మంది సిట్టింగ్ ఉన్న గ్రౌండ్లో 50వేల మందికి పైగా టిక్కెట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. చాలా సేపటి నుంచి ఎదురుచూస్తున్న అభిమానులు.. చిరంజీవి ఎంతకూ రాకపోవడం, ఒక్కొక్కరుగా తరలివస్తున్న జనంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తొక్కిసలాటకు దారితీసింది. అయితే.. చిరు అభిమానులను నిలువరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో కొంతమంతి కుర్చీలను గాల్లోకి విసిరేసి నిరసన తెలిపారు.
కాగా, వీఐపీ గ్యాలరీలోకి జనం పెద్ద ఎత్తున దూసుకు రావడంతో పోలీసులు ఒక దశలో లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. వచ్చిన వారిని చెదరగొట్టారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. రహమత్ నగర్ కి చెందిన అఖిల అనే అమ్మాయి కాలికి గాయం కావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇట్లానే మరికొంతమందికి తీవ్ర గాయాలయినట్టు తెలుస్తోంది.