తిరుమల, (ప్రభన్యూస్) : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు మలయప్పస్వామివారు నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
చంద్రప్రభ వాహనం – సకలతాపహరం
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఎంపిలు రెడ్డెప్ప, గురుమూర్తి, టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు మూరంశెట్టి రాములు, రామేశ్వరరావు, మధుసూదన్ యాదవ్, మారుతి ప్రసాద్, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జెఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహకిషోర్, ఆలయ డెప్యూటి ఈవో రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.