తిరుమల, ప్రభన్యూస్ : తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన దర్శనం, రుచికర అన్నప్రసాదాలు అందించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు సామాన్య భక్తులకు అందించే అర్జిత సేవలు, దర్శనాల ధరలను టీటీడీ పెంచలేదని, పెంచే ఆలోచన ఇప్పట్లో లేదని, ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగిందని అన్నారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పీఏసీ-4 (పాత అన్నదాన ప్రసాద భ వనం)లోని లగేజి సెంటర్‌ను శుక్రవారం ఉదయం అధికారులతో కలసి ఛైర్మన్ తనిఖీలు నిర్వహించారు. ఛైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్ కారణంగా దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి పది రోజలవుతోందన్నారు. సర్వదర్శనం ప్రారంభమైన తర్వాత తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా అల్పాహారం, అన్నప్రసాదాలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తులకు భోజనంతో పాటు రొట్టెలు, చపాతిలను అందిస్తామన్నారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో అర్జిత సేవలను పున: ప్రారంభించేందుకు సమయం పడుతుందని, ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశ్యమని, ఇందులో భాగంగా ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలను రద్దు చేశామని, దీని వల్ల సర్వదర్శనం టోకెన్లు పొందే సామాన్య భక్తులకు అదేరోజు దర్శనం జరుగుతోందని ఛైర్మన్ వివరించారు. కొండ మీద ఆహారం విక్రయించరాదని బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి ఉపాధికి ఇబ్బంది కలుగని విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి, అన్నప్రసాదం డిప్యూటి ఈవో హరీంద్రనాథ్, వీజీవో బాలిరెడ్డి, ఇతర అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.